కేసీఆర్‌కు రేవంత్‌ సన్మానమాట... ఇదెక్కడి ఫిటింగ్?

May 22, 2024


img

వచ్చే నెల (జూన్) 2వ తేదీతో తెలంగాణ ఏర్పడి పదేళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌లో అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ వేడుకలలో ముఖ్య అతిధిగా సోనియా గాంధీ హాజరు కాబోతున్నారు. సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్‌ నేతలందరూ చెప్పుకోవడం అందరూ వినే ఉంటారు. కనుక ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. 

తెలంగాణ సాధనలో కేసీఆర్‌ పాత్రని ఎవరూ కాదనలేరు. కనుక ఈ వేడుకలకు ఆయనను కూడా ఆహ్వానించి ఘనంగా సన్మానించాలని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించి, ఈ మేరకు ఆయనకు ఆహ్వానపత్రం పంపించబోతున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ వార్తను కాంగ్రెస్‌ పార్టీ ఇంకా ధృవీకరించ వలసి ఉంది. 

ఒకవేళ సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా కేసీఆర్‌ ఇంటికి వెళ్ళి ఆహ్వానిస్తే ఈ కార్యక్రమంలో పాల్గొంటారా? సన్మానం చేయించుకుంటారా? అంటే అనుమానమే. ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీలో అందరూ కేసీఆర్‌ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, కనుక ఆయన ‘తెలంగాణ పిత’ అని చెప్పుకుంటారు. కానీ కాంగ్రెస్‌ నేతలు మాత్రం సోనియాగాంధీయే తెలంగాణ ఇచ్చింది కనుక ఆమె ‘తెలంగాణ తల్లి’ అని చెప్పుకుంటారు. ఇదీగాక తెలంగాణ ఏర్పాటు ఇస్తే బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తానని కేసీఆర్‌ సోనియా గాంధీకి మాట ఇవ్వడమే కాకుండా కుటుంబ సమేతంగా ఢిల్లీ వెళ్ళి ఆమెతో ఫోటోలు కూడా దిగారు. 

కనుక ఒకవేళ ఈ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరైతే కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీని హైలైట్ చేసి, కేసీఆర్‌ని తక్కువ చేసి చూపిస్తే అవమానంగా ఉంటుంది. పైగా మాట తప్పినందుకు సోనియా గాంధీ పక్కన కూర్చోవడం కేసీఆర్‌కు ఇబ్బందికరంగానే ఉంటుంది. కనుక ఒకవేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆహ్వానించినా కేసీఆర్‌ వెళ్ళకపోవచ్చు. 

వెళ్ళకపోతే “శాసనసభ సమావేశాలకు రమ్మంటే ఎలాగూ రావడం లేదు. ఇప్పుడు సన్మానం చేస్తామన్నా రావడానికి కేసీఆర్‌ భయపడుతున్నారు,” అంటూ రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మంత్రులు ఎద్దేవా చేయకుండా ఉండరు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో?


Related Post