ఏపీతో సత్సంబంధాలు ఆశిస్తున్నా: రేవంత్‌ రెడ్డి

May 22, 2024


img

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సకుటుంబ సమేతంగా బుధవారం ఉదయం 8.30 గంటలకు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయనకు సాదరంగా స్వాగతం పలికి దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయించారు. 

అనంతరం సిఎం రేవంత్‌ రెడ్డి ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “తెలంగాణలో వర్షాలు పడటంతో రాష్ట్రంలో రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఏపీలో అధికారంలోకి రాబోతున్న ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నాను,” అని అన్నారు. 

లోక్‌సభ ఎన్నికల సమయంలో కేసీఆర్‌ బస్సులో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న నష్టపోతున్న రైతులను ఓదార్చి వచ్చారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో చేతికి అంది వచ్చిన ధాన్యం తడిసిపోయిందని బాధపడుతున్న రైతులను హరీష్ రావు ఓదార్చుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల సమయంలో ‘వరికి రూ.500 బోనస్’ ఇస్తామని ప్రకటించి, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ పూర్తి కాగానే సన్నబియ్యానికి మాత్రమే రూ.500 బోనస్ ప్రకటించడాన్ని కేటీఆర్‌ తప్పు పడుతున్నారు. ఇంకా రైతు భరోసా, పంటల రుణ మాఫీ హామీలను రేవంత్‌ ప్రభుత్వం అమలుచేయలేదని కేటీఆర్‌ మంది పడుతున్నారు. 

ఓ పక్క ఈ నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో అందరి కంటే రైతులే ఎక్కువ నష్టపోయారని బిఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే, రాష్ట్రంలో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మద్య సంబంధాలు ఏవిదంగా ఉన్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. కేసీఆర్‌, జగన్‌ మద్య నేటికీ సత్సంబంధాలే ఉన్నాయి. అలాగే బిఆర్ఎస్, వైసీపి నేతలకు మద్య సత్సంబంధాలే ఉన్నాయి. కానీ పదేళ్ళు గడిచినా విభజన సమస్యలను పరిష్కరించుకోకుండా అలాగే వదిలేశారు. బహుశః అవసరమైనప్పుడు వాటితో సెంటిమెంట్ రగిలించుకోవచ్చని విడిచిపెట్టేశారేమో?

ఈసారి ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ వస్తే చంద్రబాబు నాయుడు, రేవంత్‌ రెడ్డికి మద్య సత్సంబందాలే ఉన్నాయి కనుక విభజన సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తే మంచిదే. 

కానీ ఈ సమస్యల పరిష్కారానికి వారిరువురూ ఏ మాత్రం చొరవ చూపినా వెంటనే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు తదితర బిఆర్ఎస్ నేతలు, చంద్రబాబు నాయుడుతో రేవంత్‌ రెడ్డి కుమ్మక్కు అయ్యి తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. కనుక ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు రాష్ట్రాల మద్య సమస్యలు పరిష్కరించుకోవడం కష్టమే. 


Related Post