ఈ విషయంలో కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌లది ఒకటే అభిప్రాయం!

May 15, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని, సిఎం రేవంత్‌ రెడ్డిని బిఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ నేతలు ఎంతగా ద్వేషిస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ నేతలు కూడా కేసీఆర్‌, బిఆర్ఎస్‌ తీరుని ఎండగడుతున్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బిఆర్ఎస్‌ నేతలు, బిఆర్ఎస్‌ పార్టీని తుడిచిపెట్టేస్తామని కాంగ్రెస్‌ నేతలు బెదిరించుకుంటున్నారు కూడా. ఇంత బద్ద శతృత్వం ఉన్న కాంగ్రెస్‌, బిఆర్ఎస్‌ పార్టీలు ఒక్క విషయంలో మాత్రం ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అదే... బీజేపీ పరిస్థితి గురించి. 

రెండు పార్టీలు కూడా ఈసారి రాష్ట్రంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాకపోవచ్చునని చెపుతున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీకి 200-220కి మించి సీట్లు రావని, మోడీ గద్దె దిగక తప్పదని వాదిస్తున్నారు. 

అయితే వారి ఏకాభిప్రాయం ఇక్కడి వరకే పరిమితం. కాంగ్రెస్‌ పార్టీకి అది భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమి కూడా అధికారంలోకి రాలేదని కేసీఆర్‌ బల్లగుద్ది వాదిస్తుంటే, ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని సిఎం రేవంత్‌ రెడ్డి, కూటమిలో భాగస్వామ్యపార్టీలు వాదిస్తున్నాయి.

కేసీఆర్‌ ఎప్పటిలాగే కాంగ్రెస్‌, బీజేపీలు ప్రభుత్వం ఏర్పాటు చేయలేవని తాను ప్రతిపక్షాలను కూడగట్టి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తానని చెప్పుకుంటున్నారు. 

అయితే ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీకి 2-3 సీట్లు కంటే ఎక్కువరావని, కాంగ్రెస్ పార్టీకి 9-13 సీట్లు గెలుచుకుంటుందని, బిఆర్ఎస్‌కు 6-7 స్థానాలలో డిపాజిట్లు కూడా రావని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. 

కానీ తెలంగాణలో బీజేపీ 10-12 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, ఆగస్టులో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంలో సంక్షోభం ఏర్పడబోతోందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ చెప్పారు. 

కనుక మూడు పార్టీలలో ఏది ఎన్ని సీట్లు గెలుచుకున్నా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో ఏదో జరిగే అవకాశం కనిపిస్తోంది. 


Related Post