ఎన్నికలలో ఓడిపోతామని 3 నెలల ముందే తెలుసు

May 11, 2024


img

మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతోందని నేను మూడు నెలల ముందే పసిగట్టి కేసీఆర్‌కు చెప్పాను.

ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ 40 సీట్లు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని అప్పుడే కేసీఆర్‌కు చెప్పి, నాతో సహా 20 మంది అభ్యర్ధుల స్థానాలు మార్చాలని ఒత్తిడి చేశాను. లేకుంటే గెలవడం కష్టమని చెప్పాను కానీ కేసీఆర్‌ ఒప్పుకోలేదు.

చివరికి ఊహించిన్నట్లే ఎన్నికలలో ఓడిపోయాము. కానీ ఈసారి వరంగల్‌ నుంచి బిఆర్ఎస్ అభ్యర్ధిగా లోక్‌సభకు పోటీ చేస్తున్న సుధీర్ కుమార్‌ 30-40 వేల ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలు వరంగల్‌లో రెండో స్థానం కోసమే పోటీ పడుతున్నాయి,” అని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. 

శాసనసభ ఎన్నికలలో ఓడిపోబోతున్నామని తనకు మూడు నెలల ముందే తెలుసని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పుడు తాపీగా చెపుతున్నారు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసని ఆయనే చెప్పారు. కానీ శాసనసభ ఎన్నికలలో 100కి పైగా సీట్లు గెలుచుకుంటామని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావు తదితరులు చివరి నిమిషం వరకు చెప్పుకున్నారు.

ఎన్నికలలో ఓడిపోబోతున్నామని తెలిసినా ఎవరూ ఆ విషయం ముందుగా చెప్పుకొని ఓటమిని ఖరారు చేసుకోరు కనుక ఆవిదంగా చెప్పుకున్నారని భావించవచ్చు. 

కానీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 3-4 సీట్లు కూడా రాకపోవచ్చని సర్వేలు చెపుతుంటే, కేసీఆర్‌ మాత్రం 12కి పైగా సీట్లు గెలుచుకుంటామని చెపుతున్నారు.

అంటే ఇప్పుడు కూడా ఓడిపోతామని ముందే తెలిసినా గెలుస్తామని చెప్పుకుంటున్నారేమో? ఫలితాలు వచ్చాక తెలుస్తుంది. ఒకవేళ ఓడిపోతే ఆ తర్వాత తాపీగా లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓడిపోతామని మాకు ముందే తెలుసని ఎర్రబెల్లి దయాకర్ రావు చెపుతారేమో?


Related Post