కాంగ్రెస్‌ను గెలిపిస్తే చక్కెర కర్మాగారాలు తెరిపిస్తా: రేవంత్‌

May 09, 2024


img

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి నిజామాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జీవన్ రెడ్డి తరపున బుధవారం నిజామాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “2014 ఎన్నికలలో కల్వకుంట్ల కవితని గెలిపిస్తే 100 రోజులలో జిల్లాలోని పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని, జిల్లాలో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తానని హామీ ఇచ్చి గెలిచారు. కానీ ఆమె ఏమీ చేయకపోవడంతో 2019 ఎన్నికలలో ధర్మపురి అర్వింద్‌ తనను గెలిపిస్తే 5 రోజులలోనే పసుపు బోర్డు తెస్తానని రైతులకు బాండ్ పేపర్ వ్రాసిచ్చి గెలిచారు. కానీ ఆయన కూడా ఏమీ చేయలేదు. బిఆర్ఎస్‌, బీజేపీ రెండూ కూడా నిజామాబాద్‌ ప్రజలను రైతులను మోసం చేశాయి. 

కానీ మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజామాబాద్‌తో సహా రాష్ట్రంలో మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిచేందుకు మంత్రివర్గం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, రూ. 43 కోట్లు బకాయిలు కూడా చెల్లించింది. కనుక వ్యవసాయం, రైతుల సమస్యల గురించి పూర్తి అవగాహన ఉన్న జీవన్ రెడ్డిని గెలిపిస్తే పసుపు బోర్డు ఏర్పాటు, చక్కెర కర్మాగారాలను పునః ప్రారంభించడం వంటివాటి కోసం కృషి చేస్తారు. నిజామాబాద్‌ జిల్లాని అన్ని విదాల అభివృధ్ది చేస్తాం. 

కేసీఆర్‌ తన కూతురు కోసం నిజామాబాద్‌ జిల్లా బిఆర్ఎస్‌ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని మోడీకి తాకట్టు పెట్టారు. బిఆర్ఎస్‌ అభ్యర్ధిని గెలిపిస్తే బీజేపీని గెలిపించిన్నట్లే. లోక్‌సభ ఎన్నికలు తర్వాత రెండు పార్టీలు కలిసి నా ప్రభుత్వాన్ని కూలద్రోస్తామని బెదిరిస్తున్నాయి. ఇందుకేనా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలి? జిల్లా, రాష్ట్రం, దేశాభివృద్ధి గురించి ఆలోచించని పార్టీలు మనకెందుకు?” అని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు.


Related Post