కేంద్రంలో సంకీర్ణమేనట... బిఆర్ఎస్ దానిలో చేరుతుందా?

May 07, 2024


img

కేసీఆర్‌ రెండోసారి తెలంగాణ సిఎం అయినప్పటి నుంచి ‘కేంద్రంలో బీజేపీ మళ్ళీ రాదు... సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. బిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో చక్రం తిప్పుతానని’ చెపుతూనే ఉన్నారు. కానీ కేంద్రంలో మళ్ళీ మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడింది. 

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా కేసీఆర్‌ మళ్ళీ అదే పాత పాట పాడుతున్నారు. అయితే ఈసారి 16-17 ఎంపీ సీట్లకి బదులు 12 సీట్లు ఇస్తే చాలు చక్రం తిప్పుతామని చెపుతున్నారు. 

కేసీఆర్‌ సోమవారం జగిత్యాలలో ఎన్నికల ప్రచారానికి వెళుతున్నప్పుడు, బస్సులో ఈనాడు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఓ ప్రశ్నకు జవాబు చెపుతూ, “ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోంది. దానిలో కాంగ్రెస్ పార్టీ కూడా ఓ భాగస్వామిగా ఉండబోతోంది. మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో బీజేపీకి ఈసారి పెద్ద ఎదురుదెబ్బలు తగులబోతున్నాయి. 

దక్షిణాదిన బీజేపీకి 10-12 సీట్లు వస్తే గొప్పే. జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ 12 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది,” అని కేసీఆర్‌ అన్నారు. 

కేంద్రంలో ఈసారి కాంగ్రెస్‌ భాగస్వామిగా ఉండే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతోందని కేసీఆర్‌ చెపుతున్నారు. దానిలో కీలక పాత్ర పోషించాలని కూడా కేసీఆర్‌ కలలుగంటున్నట్లు అర్దమవుతోంది. అంటే ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేయాలని కేసీఆర్‌ అనుకుంటున్నారా? సిఎం రేవంత్‌ రెడ్డి కూడా ఇదే ప్రశ్న అడుగుతున్నారు. 

“బిఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో ఇండియా కూటమిలో చేర్చుకోబోమని, కనుక కేసీఆర్‌ ఎన్డీయే కూటమిలో చేరబోతున్నారా? మరైతే ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లు డ్రామా ఆడుతున్నారా? ఇంతకీ ఆయన ఏ కూటమిలో చేరబోతున్నారు?” అని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.


Related Post