కేసీఆర్‌ మళ్ళీ పాత పాట అందుకున్నారే!

April 30, 2024


img

బిఆర్ఎస్ పార్టీకి 60 లక్షల బలమైన కార్యకర్తల సైన్యం ఉందని, దేశంలో అత్యంత ధనిక పార్టీ అని కేసీఆర్‌ సగర్వంగా చెప్పుకోవడం అందరూ వినే ఉంటారు. కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణ సెంటిమెంట్ రాజేసి పార్టీని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. 

అనూహ్యంగా అధికారం కోల్పోయి, ఫిరాయింపులతో పార్టీ చాలా బలహీనపడటంతో ఈ లోక్‌సభ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ 2-3 సీట్లకు పరిమితమైతే ఈ ఎన్నికల తర్వాత బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక కేసీఆర్‌ మళ్ళీ తనకు బాగా అచ్చివచ్చిన తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం తీసి ప్రయోగిస్తున్నారు. 

సోమవారం ఖమ్మంలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఈసారి బీజేపీ 370-400 వస్తాయని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ దానికి 200 సీట్లు కూడా రావు. కనుక కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడబోతోంది.

బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపిస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తుంది. కృష్ణా, గోదావరి జలాలను పొరుగు రాష్ట్రాలకు తరలించుకు పోవడానికి పెద్ద కుట్ర జరుగుతోంది. 

ఈ ముఖ్యమంత్రికి ఎంత సేపు అబద్దాలు చెప్పడం, ప్రజలను నమ్మించేందుకు దేవుళ్ళపై ఓట్లు వేయడం, నన్ను తిట్టడం తప్ప కృష్ణా, గోదావరి జలాలను కాపాడుకోవాలనే శ్రద్ద లేదు. కనీసం రైతులకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన కూడా లేదు. 

నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పొలాలు ఎండాయా? కరెంట్ పోయిందా? కానీ నేను పక్కకు తప్పుకోగానే తెలంగాణలో మళ్ళీ ఎందుకు ఇటువంటి దుస్థితి ఏర్పడింది? ఈ కాంగ్రెస్‌, బీజేపీల వలన దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎటువంటి ప్రయోజనం లేదని మొదటి నుంచి నేను చెపుతూనే ఉన్నాను. 

పదేళ్ళ మోడీ పాలన, నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలన చూస్తే ఇది అర్దమవుతోంది. కనుక కోట్లాది సాధించుకున్న మన తెలంగాణను కాపాడుకునేందుకు బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించుకోవడం చాలా అవసరం.

నామా నాగేశ్వరరావుని గెలిపిస్తే కృష్ణా గోదావరి జలాల కోసం పార్లమెంటులో కోట్లాడుతారు. అదే కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్ధులను గెలిపిస్తే వాళ్ళు పార్లమెంట్‌లో నోరెత్తరు,” అని కేసీఆర్‌ అన్నారు. 


Related Post