కల్వకుంట్ల కవితని అందుకే అరెస్ట్ చేశారా?

April 25, 2024


img

లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆమె బెయిల్‌ పిటిషన్‌పై మూడు రోజులు వాదోపవాదాలు సాగిన తర్వాత న్యాయమూర్తి తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే నెల 6వ తేదీన తీర్పుని ప్రకటిస్తామని చెప్పారు.

ఈ కేసులో ఆమెకు మే 6వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగించిన సంగతి తెలిసిందే. అది ముగిసే వరకు తీర్పు రిజర్వ్ చేయడం అంటే అంతవరకు ఆమెకు మరో అవకాశం లేనట్లే. ఇది కల్వకుంట్ల కవితకు ఆమె తల్లితండ్రులు, కుటుంబ సభ్యులకు చాలా నిరాశ, ఆందోళన కలిగించే విషయమే. 

ఈడీ అధికారులు ఆమెను మార్చి 15న హైదరాబాద్‌లో ఆమె నివాసం నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయారు. అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. మే 6వరకు ఉండక తప్పనందున దాదాపు రెండు నెలలు ఆమె జైల్లో ఉండబోతున్నారు. 

ఈ కేసులో ఈడీ, సీబీఐ చాలా బలమైన ఆధారాలు సమర్పించాయి. పైగా ఈ కేసులో అప్రూవర్లుగా మారిన శరత్ చంద్రా రెడ్డి వంటివారు ఈ కేసులో ఆమె ప్రమేయం ఉందని వివరించే సాక్ష్యాధారాలు  సీబీఐ, ఈడీలకు అందజేశారు. వాటినే అవి కోర్టుకి సమర్పించి గట్టిగా వాదిస్తుండటంతో ఆమెకు బెయిల్‌ లభించడం కష్టంగా మారుతున్నట్లు బెయిల్‌ పిటిషన్‌పై వాటి వాదనలు వింటే అర్దమవుతోంది. 

కానీ తెలంగాణ పోలీసులు బీజేపీ నేత బిఎల్ సంతోష్‌కు నోటీస్ ఇవ్వడానికి ఢిల్లీలో బీజేపీ కార్యాలయానికి వెళ్ళినందుకే ప్రధాని మోడీ తనపై కక్ష కట్టి లేని మద్యం కేసుని సృష్టించి అన్యాయంగా తన కూతురు కల్వకుంట్ల కవితని ఇరికించి జైల్లో పెట్టించారని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ వాదిస్తున్నారు. 

కానీ ఈ కేసు అంతకంటే చాలా ముందే మొదలైందనే విషయం కేసీఆర్‌ మరిచిన్నట్లున్నారు. ఈ కేసులో తన కూతురుకి బెయిల్‌ లభించకుండా చేస్తున్నారని కేసీఆర్‌ మరో తీవ్ర ఆరోపణ చేశారు. అంటే ఈ కేసులో రాజకీయ కోణం, ఒత్తిళ్ళు కూడా ఉన్నాయని కేసీఆర్‌ స్వయంగా ధృవీకరించిన్నట్లే. 

ఈడీ, సీబీఐలు కూడా ఇదే కారణంగా అంటే ఆమెకు రాజకీయ పలుకుబడి ఉన్నందున బెయిల్‌ ఇస్తే అప్రూవర్లపై ఒత్తిడి చేసి కేసుని ప్రభావితం చేస్తారని వాదిస్తున్నాయి. కనుక బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల మద్య రాజకీయ పరిష్కారం కుదిరితే తప్ప ఈ కేసు నుంచి కల్వకుంట్ల కవితకు విముక్తి లభించే అవకాశం ఉండక పోవచ్చు. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత అది లభించే అవకాశం కనిపిస్తోంది. 


Related Post