తెలంగాణకు మోడీ, అమిత్ షాలు... ఈసారి డిఫరెంట్!

April 21, 2024


img

ఈ నెల 25తో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్స్‌ గడువు ముగుస్తుంది. కనుక ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముగ్గురూ తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాబోతున్నారు.

ముందుగా ఈ నెల 25న అమిత్ షా రాబోతున్నారు. తొలిరోజు వరంగల్‌ నియోజకవర్గం పరిధిలో మూడు ప్రాంతాలలో రోడ్ షోలో పాల్గొంటారు. తర్వాత పార్టీ రాష్ట్ర నేతలు, అభ్యర్ధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యి ఎన్నికల ప్రచారం, వ్యూహాలు, పార్టీల బలాబలాలు తదితర అంశాల గురించి చర్చిస్తారు.

అమిత్ షాతో పాటు బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి, బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ బన్సాల్ కూడా వచ్చి తెలంగాణలో రెండు రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 

తర్వాత ప్రధాని నరేంద్రమోడీ ఈ నెలాఖరులోగా లేదా మే మొదటివారంలో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ఎన్నిక్ల ప్రచారంలో పాల్గొంటారని బీజేపీ నేతలు చెపుతున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కావలసి ఉంది. ప్రధానితో పాటు జేపీ నడ్డా కూడా వచ్చి తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.     

ఇదివరకు ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో అధికార పర్యటనకు వచ్చినప్పుడు సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మళ్ళీ వీడ్కోలు పలికారు.

ఆయన అధికారిక కార్యక్రమాలలో సిఎం రేవంత్‌ రెడ్డి కూడా పాల్గొని ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ధికి పెద్దన్నలా సాయపడాలంటూ అభ్యర్ధించారు. 

కానీ ఈసారి బీజేపీ తరపున ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. కనుక సభలు, రోడ్ షోలలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఖాయమే. కనుక ఈసారి ఆయన పర్యటనకు సిఎం రేవంత్‌ రెడ్డి దూరంగా ఉండటమే కాదు… మాటకు మాట సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. కనుక ఈసారి మోడీ, అమిత్ షాల పర్యటనలతో కాంగ్రెస్‌, బీజేపీల మద్య యుద్ధం తప్పదు. 


Related Post