ఆనాడు రాజాసింగ్ నేడు మాధవీలత?

April 21, 2024


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో హైదరాబాద్‌ బీజేపీ అభ్యర్ధిగా మాధవీలతని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అప్పటికి ఆమె బీజేపీలో లేరు. కానీ హిందూ మతం గురించి ఆమె చేసే ప్రసంగాలు, ఆ కారణంగా బీజేపీ నేతలతో ఏర్పడిన పరిచయాలు, పాతబస్తీలో ఆమె చేసే సామాజికసేవా కార్యక్రమాలు వంటివి బీజేపీ ఆమెని అభ్యర్ధిగా ఎంచుకునేలా చేశాయి. పాతబస్తీలో ముస్లిం ఓటర్లు ఎంతమంది ఉన్నారో ఉత్తరాదికి చెందిన హిందూ ఓటర్లు ఇంచుమించు అంతేమంది ఉన్నందున, ఈసారి అసదుద్దీన్‌  ఓవైసీపై ఈ హిందూ అస్త్రం ప్రయోగించి ఓడించాలనుకుంది. 

ఆమె కూడా బీజేపీ అధిష్టానం అంచనాలకు మించే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ ఇటీవల ఆమె ప్రసంగాలు మరీ మితిమీరి బీజేపీకి ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా ఇటీవల ఆమె పాతబస్తీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు, స్థానిక మసీదుపై బాణం గురిచూసి విడుస్తున్నట్లు యాక్షన్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలతో పాటు ఇతర దేశాలు కూడా  ఆ వీడియోని చూసి భారత్‌లో ముస్లింల మీద బీజేపీ బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తోందని, భారత్‌లో ముస్లింలకు భద్రత లేకుండా పోయిందంటూ కామెంట్స్ పెడుతున్నారు. దీని వలన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి నష్టం కలగడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా బీజేపీ చాలా చెడ్డ పేరు వస్తోంది. 

ఇదివరకు ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇలాగే ముస్లింలకు ఆగ్రహం కలిగేవిధంగా మాట్లాడినందుకు బీజేపీ అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇప్పుడు మాధవీలత కూడా బీజేపీ అధిష్టానానికి ఇబ్బంది కలిగే విదంగా వ్యవహరిస్తున్నారు. 

కనుక ఆమెను మార్చి మరొకరికి టికెట్‌ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే నామినేషన్స్‌ గడువు దగ్గర పడుతున్నప్పటికీ ఇంతవరకు ఆమెకు బీఫారం ఇవ్వలేదని తెలుస్తోంది.



Related Post