రేవంత్‌కు అభద్రతాభావం... కేసీఆర్‌కు అహంకారం

April 20, 2024


img

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ రాష్ట్రంలో మూడు పార్టీల నేతల విమర్శలు పదునెక్కుతున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రేవంత్‌ రెడ్డి తన ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అనే తీవ్ర అభద్రతాభావంతో ఉన్నారు. కనుక ఆయనకు దాంతోనే సరిపోతోంది. పాలన, ఎన్నికల హామీల గురించి ఆలోచించలేకపోతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ కనీసం 12 ఎంపీ సీట్లు గెలుచుకోబోతోంది. కనుక రేవంత్‌ రెడ్డి అప్పుడే ఓటమికి మానసికంగా సిద్దపడి కుంటి సాకులు వెతుక్కొంటున్నారు,” అని అన్నారు. 

కేసీఆర్‌ బస్సు యాత్ర గురించి మాట్లాడుతూ, “తెలంగాణ ప్రజలు రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ ఇద్దరూ ప్రజలను మోసగించినవాళ్ళే కనుక వారి మాటలను ప్రజలు నమ్మరు. కేసీఆర్‌ మోకాళ్ళ యాత్రలు చేసినా ప్రజలు ఆయన మాటలను నమ్మరు. కేసీఆర్‌ 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని చెపుతున్నప్పుడే రాజేంద్రనగర్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వెళ్ళి రేవంత్‌ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయినా కేసీఆర్‌, కేటీఆర్‌ అహంకారం ఏమాత్రం తగ్గలేదని వారి మాటలే నిరూపిస్తున్నాయి. పదేళ్ళ కేసీఆర్‌ అవినీతి పాలన, నాలుగు నెలల రేవంత్‌ రెడ్డి అసమర్ధ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు మోడీ నాయకత్వంలో దూసుకుపోతున్న బీజేపీకే మొగ్గు చూపుతున్నారు,” అని  లక్ష్మణ్ అన్నారు. 


Related Post