అందరికీ అప్పులే ఎవరికీ గట్టిగా ఆస్తులు లేవట!

April 20, 2024


img

ఎన్నికలు జరుగుతున్నప్పుడే నల్లధనం అంతా బయటకు వస్తుంటుంది. తనికీలలో వందల కోట్లు నగదు పట్టుబడుతుంటుంది. కానీ తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్ధులలో అందరికీ అప్పులే తప్ప పెద్దగా ఆస్తులు లేవట! ఎంపీ, ఎమ్మెల్యేలుగా, కేంద్రమంత్రులుగా అనేక ఏళ్ళు పనిచేసినప్పటికీ ఎవరి దగ్గరా పెద్దగా ఆస్తులు లేవంటే నమ్మశక్యమా? 

మజ్లీస్ అధినేత, హైదరాబాద్‌ నుంచి వరుసగా మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన అసదుద్దీన్‌  ఓవైసీ రిటర్నింగ్ అధికారికి నామినేషన్స్‌తో పాటు సమర్పించిన అఫిడవిట్‌లో స్థిరచరాస్తులు కలిపి మొత్తం రూ.23.87 కోట్లు మాత్రమే ఉన్నాయని, రూ.7.05 కోట్లు అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. 

కేంద్రమంత్రిగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్న కిషన్ రెడ్డి ఈసారి సికింద్రాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఆయనకు కేవలం రూ.19.22 కోట్లు విలువగల ఆస్తులు మాత్రమే ఉన్నాయట! తన వద్ద ఓ పాత మారుతీ 800 కారు మాత్రమే ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వద్ద పెద్దగా ఆస్తులు లేవు కానీ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ వద్ద మాత్రం రూ.39 కోట్లు ఆస్తులున్నాయి. ఆయనకు రూ.3.22 కోట్లు అప్పులు కూడా ఉన్నాయట!

  మాజీ మంత్రి, పెద్దపల్లి బిఆర్ఎస్ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్‌ ఆస్తుల విలువ రూ.5.22 కోట్లు మాత్రమే. తమ వద్ద మొత్తం 26 తులాల బంగారం ఉందని కొప్పుల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.   

 మాజీ ఐపిఎస్ అధికారి, నాగర్‌కర్నూల్‌ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ వద్ద రూ.1.41 కోట్లు విలువగల ఆస్తులు, రూ.51.80 లక్షల అప్పులు ఉన్నాయి. 

అంతంత మాత్రం ఆస్తులున్నా ఎన్నికలలో కోట్ల రూపాయలు ఎలా ఖర్చుచేస్తారో ఎవరూ చెప్పరు. పోలీసులు పట్టుకొంటున్న వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో అసలే తెలీదు. కానీ మన నాయకులు ఆణిముత్యాలు కనుక వాళ్ళు చెప్పింది నిజమే అని నమ్మాల్సిందే. 


Related Post