లిక్కర్ స్కామ్‌లో కవిత బయటపడగలరా?

April 20, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అరెస్ట్ అయ్యి గత నెలరోజులుగా ఢిల్లీ తిహార్ జైల్లో ఉంటున్న కల్వకుంట్ల కవితకు ఈ కేసు నుండి బయటపడే దారులన్నీ ఒకటొకటిగా మూసుకుపోతున్నాయి.

ఇదే కేసుని విచారిస్తున్న సీబీఐ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం ఆమె జైల్లో ఉన్నారు. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న అరబిందో ఫార్మా  డైరెక్టర్‌ శరత్ చంద్రా రెడ్డి ఈడీ నమోదు చేసిన కేసులో అప్రూవరుగా మారారు. తాజాగా సీబీఐ కేసులో కూడా ఆయన అప్రూవరుగా మారారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో న్యాయమూర్తి కావేరీ బవెజా ఎదుట వాంగ్మూలం ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. 

ఇప్పుడు కల్వకుంట్ల కవిత విషయానికి వస్తే సీబీఐ ఇదే కోర్టులో సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఆమె శరత్ చంద్రా రెడ్డిని బెదిరించడంతో ఆయన తెలంగాణ జాగృతి బ్యాంక్ ఖాతాలో రూ.80 లక్షలు వేశారని పేర్కొంది. 

ఢిల్లీలో 5 రీటెయిల్ మద్యం జోన్లు ఆయనకు చెందిన కంపెనీలకు అప్పగించేందుకు మరో రూ.25 కోట్లు అడిగారని, అందుకు ఆయన అంగీకరించకపోవడంతో ఢిల్లీ, తెలంగాణలో తన రాజకీయ పలుకుబడితో ఆయన వ్యాపారాలు దెబ్బ తీస్తామని కల్వకుంట్ల కవిత బెదిరించారని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది.

ఇందుకు గాను మహబూబ్ నగర్‌లో లేని వ్యవసాయ భూమికి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని రూ.14 కోట్లకు ఆయన చేత కొనుగోలు చేయించి ఆ సొమ్ముని తీసుకున్నారని సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొంది. 

ఇప్పుడు శరత్ చంద్రా రెడ్డి అప్రూవరుగా మారడంతో ఆయన సీబీఐ రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న వాటిని ధృవీకరిస్తారు. అప్పుడు కల్వకుంట్ల కవిత ఈ కేసులో మరింత లోతుగా ఇరుక్కుపోవడమే కాదు... డబ్బు కోసం ఈ బెదిరింపులు, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, వాటితో రిజిస్ట్రేషన్ చేయించడం తదితర నేరాలలో కూడా చిక్కుకుంటారు. 

కల్వకుంట్ల కవితకు ఈ నెల 26వరకు ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉంటారు. ఒకరోజు ముందు అంటే ఏప్రిల్‌ 25న కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌ విచారణకు వస్తుంది. ఇదివరకు జ్యూడిషియల్ రిమాండ్‌ ముగిసినప్పుడే ఆమె బెయిల్‌ దరఖాస్తుని కోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో కల్వకుంట్ల కవితని ప్రశ్నించాల్సింది ఏమీ లేదని కానీ ఆమెకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కనుక జ్యూడిషియల్ రిమాండ్‌ కొనసాగించాలని సీబీఐ వాదించింది.

అప్పుడే సీబీఐ వాదనలతో ఏకీభవించి ఆమె జ్యూడిషియల్ రిమాండ్‌ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు, ఇప్పుడు శరత్ చంద్రా రెడ్డి అప్రూవరుగా మారి ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెపితే దానిని పట్టించుకోకుండా బెయిల్‌ మంజూరు చేస్తుందని అనుకోలేము. కనుక కల్వకుంట్ల కవితకు మరికొంత కాలం తిహార్ జైలులో గడపక తప్పదేమో?


Related Post