ఇటు రేవంత్‌ రెడ్డి అటు కేసీఆర్‌... ఇక మంటలే!

April 20, 2024


img

లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్స్‌ ప్రక్రియ కూడా మొదలవడంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు, వాటి అభ్యర్ధులు మండే ఎండలను, వడగాడ్పులను కూడా లెక్క చేయకుండా జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారు. సోమవారం నుంచి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. 

ముందుగా సోమవారం ఉదయం మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టి హుజూర్ నగర్, కోదాడ, మీదుగా సూర్యాపేట వరకు రోడ్ షోలు నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం తిరుమలగిరి, జనగామ, ఆలేరు వరకు రోడ్ షోలు నిర్వహిస్తారు. రాత్రి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కి చేరుకుంటారు. 

మళ్ళీ బుధవారం ఉదయం నేరుగా వరంగల్‌ చేరుకొని నగరంలో రోడ్ షోలు నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేస్తారు.     

మరోవైపు సిఎం రేవంత్‌ రెడ్డి కూడా జోరుగా ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటూ బిఆర్ఎస్ దాని అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరుగుతున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీలో చేరిపోతారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుందన్న కేసీఆర్‌ మాటలకు ‘మమ్మల్ని ముట్టుకుంటే మాడి మసైపోతావంటూ’ సిఎం రేవంత్‌ రెడ్డి చాలా ఘాటుగా బదులిచ్చారు.

సిఎం రేవంత్‌ రెడ్డి-కేసీఆర్‌, కాంగ్రెస్‌ మంత్రులు-కేటీఆర్‌, హరీష్ రావులు చేసుకొంటున్న పరస్పర విమర్శలు, ఆరోపణలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేసవి కంటే చాలా వేడిగా మారిపోయింది. మే 11వ తేదీ సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారానికి గడువు ఉంది. అప్పటి వరకు ఈ మంటలు, వేడి కొనసాగుతూనే ఉంటాయి. 


Related Post