ఓటుకి నోటు కేసులో పిటిషన్‌: ఒక దెబ్బకు రెండు పిట్టలు?

April 18, 2024


img

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసులో మళ్ళీ కదలిక వచ్చింది. ఈ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని నిందితుడుగా చేర్చాలని, సీబీఐ చేత విచారణ జరిపించాలని ఏపీలో వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ఈ కేసు విచారణ ఎన్నెళ్ళైనా పూర్తి కాకుండా నత్తనడకలు నడుస్తోందని కనుక ఈ కేసు విచారణ బాధ్యత సీబీఐకి అప్పగించి త్వరితగతిన పూర్తిచేయాలని వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. 

ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు జూలై 24కి ఈ కేసుని వాయిదా వేసింది. అయితే మళ్ళీ వాయిదాలు కోరవద్దని ముందే సూచించింది. 

ఏపీలో వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికి ప్రధాన రాజకీయ శత్రువు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడే కనుక ఆయనను ఇదివరకే స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో జైలుకి పంపించింది. కానీ ఆయన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చేసి మళ్ళీ జగన్‌ ప్రభుత్వానికి త్వరలో జరుగబోయే ఏపీ శాసనసభ ఎన్నికలలో గట్టి సవాలు విసురుతున్నారు. 

కనుక వైసీపి ఎమ్మెల్యే ఆయనను ఓటుకి నోటు కేసులో నిందితుడుగా చేర్చాలని కోరిన్నట్లు భావించవచ్చు. అయితే తెలంగాణ ఏసీబీ విచారణ జరుపుతున్న ఈ కేసుని సీబీఐకి అప్పగించాలని కోరడం అనుమానాలకు తావిస్తోంది. 

బిఆర్ఎస్, వైసీపి అధినేతలు కేసీఆర్‌, జగన్‌ మద్య మంచి సంబంధాలే ఉన్నాయి. రెండు పార్టీల నేతల మద్య కూడా సత్సంబంధాలే ఉన్నాయి. ఇద్దరికీ రేవంత్‌ రెడ్డి, చంద్రబాబు నాయుడే ఉమ్మడి రాజకీయ శత్రువులు. ఒకవేళ సుప్రీంకోర్టు ఆళ్ళ పిటిషన్‌ను ఆమోదిస్తే అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ రేవంత్‌ రెడ్డి తీవ్ర ఇబ్బందులలో పడతారు. 

కనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే ఆలోచనతో రెండు పార్టీలు కూడబలుక్కొని వైసీపి ఎమ్మెల్యే ఆళ్ళ చేత ఈ కేసు వేయించాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 


Related Post