రేవంత్‌ ప్రభుత్వం ఏడాది కూడా నడవదు: కేసీఆర్‌

April 17, 2024


img

శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అనూహ్యంగా ఓడిపోయి కేసీఆర్‌ గద్దె దిగవలసి రావడంతో ఆయనలో తీవ్ర అసహనంతో ఉన్నారని నిన్న మరోసారి బయటపెట్టుకున్నారు.   

సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాశీర్వాద సభలో కేసీఆర్‌ ప్రసంగం వింటే ఈ విషయం అర్దమవుతుంది.

రేవంత్‌ రెడ్డి ఓ లిల్లీపుట్. ఆయన తీరు చూస్తే ఏడాది కూడా ప్రభుత్వం నడపలేడనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎంతమంది మంత్రులు కాంగ్రెస్‌లో ఉంటారో ఎంతమంది జంప్ అయిపోతారో తెలీదు. ఈ లిల్లీపుట్ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా బీజేపీలోకి జంప్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. 

ఈ ప్రభుత్వాన్ని చూసి మేమేమీ అసూయతో బాధపడటం లేదు. పూర్తి ఐదేళ్ళు అధికారంలో ఉండాలనే కోరుకొంటున్నాము. పాలిచ్చే బర్రెను కాదని దున్నపోతును తెచ్చుకున్న ప్రజలకు అప్పుడే పాలు నీళ్ళ తేడా తెలిసి తెలిసి వస్తుంది. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ గెలవకపోతే మాకేమీ నష్టం లేదు. ప్రజలే నష్టపోతారు. కనుక తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవలసిన బాధ్యత మీపైనే ఉంది. 

ఈ ముఖ్యమంత్రి నన్ను పండబెట్టి తొక్కుతాడట, నా ముడ్డి మీద చెడ్డీ లేకుండా గుంజుకుంటాడట... ఇదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి మాట్లాడే భాష? నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఇలా మాట్లాడానా?  

మేము 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఆయన జయంతి రోజున ఈ లిల్లీపుట్ మంత్రులు ఎవరూ అక్కడకు వెళ్ళి కనీసం ఓ పువ్వు పెట్టలేదు. కానీ ఆ మహనీయుడి పేరుతో మేము కట్టించిన సచివాలయంలో సిగ్గు లేకుండా కూర్చొంటున్నారు.   

ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు నడవదు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము. ఇప్పుడు చెలరేగిపోతున్న ప్రతీ ఒక్కరి పేరు మా డైరీలో నోట్ చేసుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ మా పార్టీ నేతలని, కార్యకర్తలని, ప్రజలను వేధిస్తున్న పోలీసులు, అధికారులందరిపై కటిన చర్యలు తీసుకుంటాము. కనుక మీ పరిధి దాటకుండా విధులు నిర్వహించుకుంటే మీకే మంచిది,” అని కేసీఆర్‌ హెచ్చరించారు. 


Related Post