బీజేపీ నేతలు తెలంగాణ కాంగ్రెస్‌కు అవసరమా?

April 13, 2024


img

శాసనసభ ఎన్నికల తర్వాత పలువురు బిఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీని వీడి కాంగ్రెస్‌, బీజేపీలలో చేరిపోయారు. రాజకీయాలలో ఇది చాలా సర్వసాధారణమే. అయితే ఇప్పుడు బీజేపీలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలయ్యాయి. సంగారెడ్డి బీజేపీ ఇన్‌చార్జి పులిమామిడి రాజు, మక్తల్ బీజేపీ సీనియర్ నేత జలంధర్ రెడ్డి ఇద్దరూ నేడు జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వారికి సిఎం రేవంత్‌ రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.  ఈ చేరికల కార్యక్రమంలో మెదక్ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మెదక్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్ధి నీలం మధు తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అన్నీ సవ్యంగా సాగితే మరో 5 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ గెలిచి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికీ రాష్ట్రంలో రాలేదు. కనుక రాష్ట్ర బీజేపీ నేతలు కూడా అధికార పార్టీలోకి చేరాలనుకోవడం సహజమే. 

అయితే తమ పార్టీ జోలికి వస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వెనకడమని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నప్పుడు, బీజేపీ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అంటే సమస్యలను, ప్రమాదాన్ని చేజెతులా ఆహ్వానించడమే అవుతుంది కదా?మరి కాంగ్రెస్‌ ప్లాన్ ఏమిటో?



Related Post