బిఆర్ఎస్‌ పగటి కలలు కంటోందా... మభ్యపెడుతోందా?

April 12, 2024


img

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పుతా, దేశాన్ని ఏలుతా... గుణాత్మకమైన మార్పు, కారు సారు ఢిల్లీ సర్కారు అంటూ కేసీఆర్‌ చేసిన హడావుడి, ఆ తర్వాత చల్లబడిపోవడం అందరూ చూశారు. ఏదో ఒకసారి అంటే ప్రజలు నమ్ముతారు కానీ ప్రతీ లోక్‌సభ ఎన్నికలకు ఇదే మాటలు చెపుతుంటే ఎవరు నమ్ముతారు? 

ఇప్పుడు కేసీఆర్‌ బదులు కేటీఆర్‌ అవే మాటలు చెపుతున్నారు. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్‌, బీజేపీలకు దేనికీ పూర్తి మెజార్టీ రాదని, బిఆర్ఎస్‌ పార్టీకి 10 ఎంపీ సీట్లు వస్తే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పవచ్చని కేటీఆర్‌ అన్నారు. మళ్ళీ కేంద్రంలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని సర్వేలన్నీ తేల్చి చెప్పేశాయి. పైగా ఈసారి కనీసం 370-400 సీట్లు సాధించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తోంది. 

ఈ సర్వేలన్నీ బోగస్ అనుకున్నా, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు. ఇండియా కూటమిలో పార్టీల మద్య ఐఖ్యత లేదు. కనుక కాంగ్రెస్‌, ఇండియా కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది.  మరోపక్క మోడీ, అమిత్ షాలు ఎన్డీఏలోకి టిడిపి వంటి పాత మిత్రులందరినీ ఆహ్వానించి బలోపేతం చేసుకొంటున్నారు. వాటి ద్వారా వచ్చే సీట్లు బీజేపీకి బోనస్ వంటివే. కనుక ఈసారి ఎన్నికలలో కూడా బీజేపీయే గెలిచి అధికారంలోకి రావడం ఖాయమే. 

కనుక కేటీఆర్‌ ఈవిదంగా మాట్లాడటం లోక్‌సభ ఎన్నికలలో కనీసం పది సీట్లు గెలుచుకునేందుకు ప్రజలను మభ్య పెట్టేందుకే అని భావించవచ్చు. 

ఒకవేళ కాంగ్రెస్‌, బీజేపీలకు మెజార్టీ రాకపోయినా బిఆర్ఎస్‌ పది సీట్లతో చేయగలిగేది ఏమీ ఉండదు. ఎందుకంటే పొరుగున ఏపీతో సహా దేశంలో చాలా రాష్ట్రాలలో 20-40 ఎంపీ సీట్లున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. ఆ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి కూడా. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకి మద్దతు అవసరమైతే కాంగ్రెస్‌, బీజేపీలు ముందుగా వాటికే ప్రాధాన్యం ఇస్తాయి తప్ప 3-4 ఎంపీ సీట్లు ఉండే బిఆర్ఎస్‌ పార్టీకి కాదు. 

అయినా ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపీలు తెలంగాణలో బిఆర్ఎస్‌ పార్టీకి 2-3 సీట్లు కంటే ఎక్కువ రాకుండా చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కనుక ఆకాశంలో మబ్బులు చూసి ముంతలో నీళ్ళు ఒలకబోసుకొన్న కేసీఆర్‌లాగా పగటి కలలు కనకుండా బిఆర్ఎస్‌ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా కేటీఆర్‌ మాట్లాడితే బాగుంటుంది.

అయినా కాంగ్రెస్‌, బీజేపీలతో తమకు ఎటువంటి లోపాయికారి ఒప్పందాలు లేవని చెప్పుకొంటున్నప్పుడు,  మళ్ళీ కేంద్రంలో వాటికే మద్దతు ఇస్తామని కేటీఆర్‌ చెప్పుకోవడం ద్వంద వైఖరి కాదా?


Related Post