మహాలక్ష్మి పధకంతో టిఎస్‌ఆర్టీసీ మునిగిపోబోతోందా?

April 11, 2024


img

అందరూ మహాలక్ష్మి తమని కరుణించాలని కోరుకొంటారు కానీ టిఎస్‌ఆర్టీసీకి మాత్రం మహాలక్ష్మి పధకం చాలా భారంగా మారింది.

ఈ పధకంతో ఆర్టీసీ బస్సులలో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడంతో బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికులతో బస్సులు కిటకిటలాడితే ఆర్టీసీకి లాభాలు వస్తాయి. కానీ మహిళలందరికీ జీరో టికెట్స్ జారీ చేస్తుండటం వలన టిఎస్‌ఆర్టీసీ ఆమేరకు ఆదాయం కోల్పోయి తీవ్రంగా నష్టపోతోంది. 

మహాలక్ష్మి పధకంతో టిఎస్‌ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని రవాణాశాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్‌ చెప్పారు. కానీ గత నాలుగు నెలలుగా టిఎస్‌ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడంతో రోజువారీ నిర్వహణ ఖర్చులకు కూడా టిఎస్‌ఆర్టీసీ ఇబ్బందులు పడుతోందని బిఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ ఏదో విదంగా రాష్ట్రంలో అధికారంలోకి రావలని నోటికి వచ్చిన హామీలు ఇచ్చేసిందని, ఇప్పుడు వాటికి నిధులు లేక అమలుచేయలేక చేతులెత్తేసిందని బిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు.

కాంగ్రెస్‌ బాధితులలో ఇప్పుడు టిఎస్‌ఆర్టీసీ కూడా చేరిందని, ఇకనైనా ప్రభుత్వం తక్షణం టిఎస్‌ఆర్టీసీకి బకాయిలు విడుదల చేయకపోతే మున్ముందు డీజిల్ కొనుగోలుకి, సిబ్బంది జీతాలు చెల్లింపులకి కూడా మూతపడే పరిస్థితి వస్తుందని బిఆర్ఎస్‌ నేతలు హెచ్చరిస్తున్నారు. వారి హెచ్చరికలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వింటుందో లేదో?


Related Post