మరో పదేళ్ళు రేవంత్ సిఎం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

April 11, 2024


img

రేవంత్‌ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టడాన్ని గట్టిగా వ్యతిరేకించిన కాంగ్రెస్‌ నాయకులలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఒకరు. రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికే ఆయన ఇష్టపడలేదు. కానీ కాంగ్రెస్‌ అధిష్టానం రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడటంతో రేవంత్‌ రెడ్డి నాయకత్వాన్ని అంగీకరించక తప్పలేదు. 

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన రేవంత్‌ రెడ్డితో పోటీ పడ్డారు కూడా. కానీ రేవంత్‌ రెడ్డి మంత్రివర్గంలోనే మంత్రిగా సెటిల్ అవక తప్పలేదు. కనుక ఆయనలో గూడుకట్టుకొన్న ఈ అసంతృప్తితో ఏనాటికైనా రేవంత్‌ రెడ్డి కుర్చీకి ఎసరు పెడతారని బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. 

నేడు రంజాన్ పండుగ ముగింపు సందర్భంగా నల్గొండ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింల తో కలిసి ప్రార్ధనలలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో కట్టప్పలు, ఏక్‌నాధ్ షిండేలు ఎవరూ లేరు. వారు బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలలోనే ఉన్నారు. 

కానీ మా కాంగ్రెస్‌ నేతల మద్య చిచ్చు పెట్టి మా ప్రభుత్వాన్ని కూలద్రోయాలని ఎదురుచూస్తునందునే బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల నేతలు ఈవిదంగా మాట్లాడుతున్నారు. రేవంత్‌ రెడ్డి మరో పదేళ్ళు ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తారు.   మేమందరం ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాము,” అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 



Related Post