ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న కల్వకుంట్ల కవితని సీబీఐ అధికారులు జైల్లోనే విచారణ జరిపి నేడు అరెస్ట్ చేశారు.
ఇన్నిరోజులుగా ఆమె ఈడీ కస్టడీలో ఉండగా ఇప్పుడు ఆమెను సీబీఐ తన కస్టడీలో తీసుకుంది. సీబీఐ అధికారులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలోని తమ కార్యాలయానికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత తతంగం అందరికీ తెలిసిందే.
ముందుగా వైద్య పరీక్షలు చేయించి, రేపు కోర్టులో హాజరుపరుస్తారు. ఈడీ నమోదు చేసిన కేసులో ఆమెకు ఈ నెల 23వరకు జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉండాల్సి ఉంది. ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది.
ఇంతలోనే అదే కోర్టు అనుమతితో సీబీఐ ఆమెను జైల్లోనే ప్రశ్నించి తమ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ రేపు అదే కోర్టులో ప్రవేశపెట్టబోతుండటం విశేషం.
ఈడీ కేసులో ఆమె జ్యూడిషియల్ రిమాండ్ ముగియక మునుపే సీబీఐ ఆమెను అరెస్ట్ చేయడం చూస్తే, ఆమెకు ఇప్పట్లో జైలు నుంచి విముక్తి లభించే అవకాశం లేన్నట్లే కనిపిస్తోంది.