శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. కనుక లోక్‌సభ ఎన్నికలలో కనీసం 7-8 ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోతే ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా తప్పుడు సంకేతాలు వెళతాయి.
కనుక బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలో దిగుతున్నారు. ఈ నెల 13న చేవెళ్ళలో బహిరంగ సభ నిర్వహించి, ఆ తర్వాత వచ్చే నెల 13వరకు ఏకధాటిగా 17 నియోజకవర్గాలలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
కేసీఆర్ బస్సు యాత్రలకు, మిగిలిన నేతల ఎన్నికల ప్రచారానికి సంబందించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కేటీఆర్, హరీష్ రావు తదితర సీనియర్ నేతలందరూ కూడా ఏప్రిల్ 13 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.
కేసీఆర్ ఇప్పటికే పలు జిల్లాలలో పర్యటించి సాగు నీరు అందక ఎండిపోతున్న పంటలను పరిశీలించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ప్రజలను ఆకట్టుకొంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారగా, బిఆర్ఎస్ నేతలు వాటినే ఆయుధాలుగా చేసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో పోరాడుతున్నారు.
ఈ నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వస్తే సిఎం రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు మొదలవుతాయి. మరోపక్క బీజేపీ కూడా లోక్‌సభ ఎన్నికలలో కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలతో ప్రయత్నిస్తోంది. కనుక మూడు పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారినందున ఈసారి వాటి మద్య చాలా తీవ్రమైన పోటీ నెలకొంది.
లోక్‌సభ 4వ దశ ఎన్నికలలో తెలంగాణలో ఎన్నికలకు ఏప్రిల్ 18 నోటిఫికేషన్ జారీ కాబోతోంది. ఆరోజు నుంచి ఏప్రిల్ 25వరకు నామినేషన్స్ స్వీకరణ, ఏప్రిల్ 29 వరకు నామినేషన్స్ ఉపసంహరణ గడువు ఉంటుంది. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించి జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు.