లిక్కర్ స్కామ్‌లో నేను బాధితురాలిని: కల్వకుంట్ల కవిత

April 09, 2024


img

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచినప్పుడు, ఆమె న్యాయమూర్తితో ఈ కేసుకు సంబందించి కొన్ని అంశాలను చెప్పాలనుకున్నారు. వాటిని ముందుగానే కాగితాల మీద వ్రాసుకు వచ్చారు కూడా. కానీ న్యాయమూర్తి అందుకు అంగీకరించకపోవడంతో ఆమె ఆ కాగితాలను అక్కడే ఉన్న తెలుగు మీడియా ప్రతినిధులకు అందజేశారు. 

ఇంతకీ ఆమె ఏమి వ్రాసుకొచ్చారంటే, “లిక్కర్ స్కామ్‌ కేసులో నేను ఆర్ధిక లబ్ధి పొందిన్నట్లు సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. కానీ నాకు ఈ కేసుతోనే సంబంధం లేదు. కనుక నేను ఎటువంటి ఆర్ధిక లబ్ధి పొందలేదు.. ఈ కేసులో నేను నిందితురాలిని కాను. బాధితురాలిని. 

రాజకీయ కారణాల వలన నాకు సంబంధం లేని ఈ కేసులో నన్ను ఇరికించి, నేను చేయనివి చేసిన్నట్లు నిరూపించేందుకు సీబీఐ, ఈడీలు రెండేళ్ళుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు నిరూపించలేకపోయాయి. కానీ ఈ కేసును రెండేళ్లుగా సాగదీస్తున్నందున నేను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నాను. 

ఒకవేళ నేను నేరం చేసిన్నట్లు సీబీఐ, ఈడీలు భావిస్తున్నట్లయితే, వాటి వద్ద అందుకు బలమైన సాక్ష్యాధారాలు ఉన్నట్లయితే తెలంగాణలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు? మా పార్టీ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఎందుకు అరెస్ట్ చేశారు?

నేను విచారణకు సహకరించడం లేదని, నా మొబైల్ ఫోన్లలో డేటా ధ్వంసం చేశానని సీబీఐ, ఈడీలు నాపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్దాలే. వాటికి నేను పూర్తిగా సహకరిస్తున్నా నన్ను వేదిస్తున్నాయి. నా కుమారుడికి పరీక్షలు జరుగుతున్నందున నాకు తక్షణం బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతున్నాను,” అని కల్వకుంట్ల కవిత తన లేఖలో వ్రాసుకొచ్చారు.


Related Post