కల్వకుంట్ల కవిత బెయిల్‌ నిరాకరణకు ఎన్ని కారణాలో!

April 09, 2024


img

 లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మధ్యంతర బెయిల్‌ తిరస్కరించింది. బెయిల్‌ తిరస్కరించడం కంటే అందుకు న్యాయస్థానం పేర్కొన్న కారణాలు చాలా ఆలోచింపజేస్తాయి. వాటి గురించి క్లుప్తంగా... 

1. కల్వకుంట్ల కవిత అబల, అమాయకురాలు, లోక జ్ఞానం లేని వ్యక్తి కారు. ఆమె విదేశంలో ఉన్నత చదువులు, ఇదివరకు ఎంపీగా, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. కనుక సుప్రీంకోర్టులోని ఇతర కేసులలో మహిళలతో ఆమెను పోల్చి చూడలేము. 

2. కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెను ఎవరో ఇరికించారని లేదా ఆమె అమాయకంగా ఇరుక్కున్నారనుకోలేము.

3. పిల్లల పరీక్షల కోసం బెయిల్‌ ఇవ్వడం మొదలుపెడితే లక్షలమందికి బెయిల్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అయినా ఆమె పెద్ద కుమారుడు తల్లితండ్రులకు దూరంగా స్పెయిన్‌లో చదువుకొంటున్నప్పుడు, అతని కంటే నాలుగేళ్ళు చిన్నవాడైన రెండో కుమారుడు సొంతింట్లో తండ్రి కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మద్య ఉన్నందున అతని పరీక్షలకు తల్లి మార్గదర్శనం అవసరమని మేము భావించడం లేదు. అయినా ఇప్పటికే సగం పరీక్షలు ముగిసిపోయాయి కదా? 

4. కల్వకుంట్ల కవిత జైలులో ఉన్నప్పటికీ ఆమెను కలుసుకునేందుకు ఆమె భర్త, పిల్లలు, తల్లితండ్రులు, కుటుంబసభ్యులను అందరినీ అనుమతిస్తూనే ఉన్నాము. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కూడా ఆమెను చూసి మాట్లాడే అవకాశం ఉంది. 

5. ఆమెను విచారణకు పిలిచినప్పుడు హాజరుకాకుండా తప్పించుకొనే ప్రయత్నాలు చేశారు. బయట ఉన్నప్పుడు ఈ కేసుకి సంబందించి సాక్షాధారాలు (తన ఫోన్లలో డాటా) నాశనం చేశారని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. ఆమె ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేశారని ఈడీ బలమైన సాక్ష్యాధారాలు కూడా చూపించింది.  

కనుక కల్వకుంట్ల కవితకు మధ్యంత బెయిల్‌ నిరాకరిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు చెప్పారు. ఆమె రెగ్యులర్ బెయిల్‌ కేసు విచారణ ఈ నెల 16న కోర్టు ముందుకు వస్తుంది.

కావేరీ బవేజా 21 పేజీల తీర్పులో పేర్కొన్న విషయాలను గమనిస్తే, ఈ కేసులో ఆమె నేరం చేసిన్నట్లు న్యాయస్థానం అభిప్రాయపడుతున్నట్లు అర్దమవుతోంది. కనుక కల్వకుంట్ల కవితకు 16వ తేదీనైనా బెయిల్‌ లభిస్తుందో లేదో అనుమానమే. అలాగే కుమారుడి పరీక్షల కోసం బెయిల్‌ కోరడం మరో పొరపాటని కూడా స్పష్టం అయ్యింది. 

కల్వకుంట్ల కవితకు న్యాయస్థానం జ్యూడీషియల్ రిమాండ్ ఈనెల 23 వరకు పొడిగించింది. 


Related Post