నన్ను బదనామ్ చేయడానికి 50 టీఎంసీలు నీళ్ళు వదిలేశారు

April 07, 2024


img

బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “ఈ కాంగ్రెస్‌ మంత్రులలో ఎవరికీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కనీస అవగాహన లేదు. పంపు హౌసులు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటిలో ఎన్ని పంపులున్నాయో, వాటిని ఉపయోగించుకొని జలాశయాలలో నీటిని ఎప్పుడు ఏవిదంగా తోడిపోసుకోవాలో వంటి కనీసం అవగాహన లేదు. కానీ మేడిగడ్డ బ్యారేజిలో రెండు మూడు పిల్లర్లు క్రుంగిపోతే, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందన్నట్లు డ్రామా ఆడుతున్నారు. 

నేను ఇంజనీర్లకు ఫోన్ చేసి ఈ మంత్రులకు తెలియకపోతే మీకు తెలివి లేదా? అసలు కధ ఏమిటని అడిగితే వాళ్ళే చెప్పారు.... ఈ ప్రభుత్వమే బ్యారేజిలో మిగిలిన 50 టీఎంసీల నీళ్ళని విడిచి పెట్టేయమని చెప్పిందన్నారు. ప్రభుత్వ ఆదేశం ప్రకారం బ్యారేజిలో నీటిని వృధాగా సముద్రంలోకి విడిచిపెట్టేశామని ఇంజనీర్లే నాకు చెప్పారు. 

నన్ను బదనామ్ చేయాలనే మేడిగడ్డ బ్యారేజిలో నీటిని సముద్రంలోకి విడిచిపెట్టేసి, ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడకు వెళ్ళి పిల్లర్లు క్రుంగిపోయాయంటూ డ్రామాలు ఆడారు. ఏ ప్రాజెక్టులో అయినా ఒకటి రెండు పిల్లర్లు క్రుంగుతూనే ఉంటాయి. దానికి అనేక కారణాలు ఉంటాయి. 

అప్పుడు వాటికి వెంటనే మరమత్తులు చేయించి వర్షాకాలం మొదలయ్యేసరికి నీటిని నిలువ చేసుకునేందుకు బ్యారేజిని సిద్దంగా చేసి ఉంచుకుంటారు. కానీ ఈ తెలివితక్కువ దద్దమ్మలు వాటికి మరమత్తులు చేయించకుండా ఏదో జరిగిపోయిందంటూ డ్రామాలు ఆడుతూ విలువైన సమయాన్ని వృధా చేస్తోంది. 

నా మీద కక్షతో మేడిగడ్డ బ్యారేజిలో మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేసి రైతులకు సాగునీరు లేకుండా చేసి నష్టపరుస్తోంది. ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. ఇలాగే ప్రవర్తిస్తే నేను స్వయంగా 50వేల మంది రైతులను వెంటేసుకొని మేడిగడ్డ బ్యారేజి వద్దకు వెళ్ళి గేట్లు ఎత్తించి మిగిలిన నీటిని కాలువలలోకి పారించి పంటలు కాపాడుతాను,” అని కేసీఆర్‌ అన్నారు.


Related Post