ఇవిగో చేనేత లెక్కలు... రాజకీయాలు చేయొద్దు కేటీఆర్‌: తుమ్మల

April 06, 2024


img

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికులకు బతుకమ్మ చీరలు నేసేందుకు ఆర్డర్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వారిని మళ్ళీ రోడ్డున పడేస్తోందని ఆరోపిస్తూ బిఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సిఎం రేవంత్‌ రెడ్డికి ఓ బహిరంగ లేఖ వ్రాశారు. 

దానిపై రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందిస్తూ, “కేటీఆర్‌ ప్రతీ అంశంపై రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే చేనేత కార్మికుల సమస్యల పేరుతో కూడా రాజకీయాలు చేస్తున్నారు. బిఆర్ఎస్‌ హయాంలో చేనేత కార్మికులను ఆదుకున్నామని కేటీఆర్‌ గొప్పలు చెప్పుకున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్రంలో 393 సంఘాలలో 105 సంఘాలకు మాత్రమే పని కల్పించి మిగిలిన వాటిని పట్టించుకోకపోవడంతో వాటిలో చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోయారు. 

అలాగే పరస్పర వినిమయ సంఘాల విషయంలో బిఆర్ఎస్‌ ప్రభుత్వం అనుసరించిన విధానాల వలన కూడా చేనేత కార్మికులు నష్టపోయారు. బిఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి బతుకమ్మ చీరల పధకం కింద టెస్కోకు రూ. 351.52 కోట్లు బకాయిలు ఉంచేసింది. ఇవన్నీ కేటీఆర్‌ చెప్పకుండా మా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. 

మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే చేనేత సహకార సంఘాలకు రూ.8.81 కోట్లు బకాయిలు చెల్లించాము. త్వరలో మరో రూ.7 కోట్లు చెల్లించబోతున్నాము. ప్రభుత్వంలో వివిద శాఖల అవసరాల కోసం రూ.53 కోట్లు విలువైన వస్త్రాలను కొనుగోలు చేశాము. 

సమగ్ర శిక్షా అభియాన్ పధకంలో భాగం విద్యార్దులకు స్కూలు యూనిఫారంలు తయారుచేసి ఇచ్చేందుకుగాను రూ.94 కోట్లలో 50 శాతం అంటే రూ.47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించాము. ఎన్నికలలో హామీ ఇచ్చిన్నట్లు త్వరలోనే నేతన్న భరోసా పధకాన్ని ప్రారంభించబోతున్నాము.

 రాష్ట్రంలో విద్యుత్ చౌర్యం చేస్తున్న బోగస్ సహకార సంఘాలను ఏరివేసి మిగిలిన వాటిని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నాము. రాష్ట్రంలో చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలన్నిటికీ శాస్విత పరిష్కారాలు చేసేందుకు చాలా చర్యలు చేపట్టాము. 

మా ప్రభుత్వం చేస్తున్న పనులతో లబ్ధి పొందుతున్న చేనేత కార్మికులకు తెలిస్తే చాలనుకున్నాము తప్ప బిఆర్ఎస్ నేతల్లాగా గొప్పలు చెప్పుకోవాలనుకోవడం లేదు,” అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.


Related Post