ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్

April 04, 2024


img

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం బయటపడుతోంది. అయితే అవన్నీ బిఆర్ఎస్ పార్టీ మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. రెండేళ్ళ క్రిందట అంటే 2022, అక్టోబర్ నెలలో ముగ్గురు బీజేపీ ప్రతినిధులు నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భారీగా డబ్బు ముట్టజెప్పి పార్టీ ఫిరాయింపజేసేందుకు ప్రయత్నించడం, అప్పుడు అవినీతి నిరోధక శాఖ, ఇంటలిజన్స్ విభాగం  పోలీసులు కలిసి వారిని వలపన్ని పట్టుకోవడం తదితర విషయాలన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. 

చాలా హైడ్రామాగా సాగిన ఆ వ్యవహారం మొత్తం అప్పటి ఇంటలిజన్స్ ఎస్ఓడీ రాధాకిషన్ రావు, ఇంటలిజన్స్ డీఎస్పీ ప్రణీత్ రావుల అధ్వర్యంలోనే జరిగింది. ముందుగా వారి బృందం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాపింగ్ చేసి బీజేపీ నేతల సంభాషణలను రికార్డ్ చేశారు. 

తర్వాత పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో రహస్యంగా సిసి కెమెరాలు అమర్చి, ఆయన ద్వారానే బీజేపీ ప్రతినిధులతో మాట్లాడించి అక్కడకు వారిని రప్పించారు. వారు అక్కడ మాట్లాడిన విషయాలన్నీ రికార్డ్ చేసిన తర్వాత ఏసీబీ పోలీసులు వచ్చి ముగ్గురు బీజేపీ ప్రతినిధులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కధ అందరికీ తెలిసిందే. 

అయితే అప్పుడు మీడియాతో సహా అందరి దృష్టి బిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనే ఉంది తప్ప అంతకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంపై పడలేదు. కానీ ఇప్పుడు అదే ప్రణీత్ రావుని ప్రశ్నిస్తున్నప్పుడు, ఆనాటి ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం కూడా మెల్లగా బయటపడింది. 

అయితే అది అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత ప్రణీత్ రావు బృందం హైదరాబాద్‌ నుంచి ఓ ప్రత్యేక విమానంలో ఢిల్లీ, కేరళకు వెళ్ళి వచ్చారు. కనుక ఆనాడు వారు ఉపయోగించిన ప్రత్యేక విమానం ఎవరిది? ఎందుకు ఇచ్చారు?అని పోలీసులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావులను ఆరా తీయగా అది ఓ బిఆర్ఎస్‌ నేతకు చెందినదని తెలిసింది. కనుక తీగ లాగితే డొంక అంతా కదిలిన్నట్లు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ బిఆర్ఎస్‌ పార్టీ నేతల మెడకు చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. 



Related Post