హైదరాబాద్‌లో మళ్ళీ నకిలీ నోట్లు... 25 లక్షలు!

April 04, 2024


img

మోడీ ప్రభుత్వం పెద్ద నోట్ల (రూ.1,000) రద్దు చేయడానికి చెప్పిన ప్రధాన కారణాలలో ఒకటి దేశంలో చలామణి అవుతున్న నకిలీ నోట్లకు అడ్డుకోవడం. అందుకోసం ఇంకా పెద్ద నోటు రూ.2,000ని ప్రవేశ పెట్టడం, నోట్ల రద్దుతో యావత్ దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి రావడం, కొత్త నోట్ల కొరత వంటి అనేక కారణాల వలన మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

అయితే కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2,000, రూ.500 నోట్లు అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్స్‌తో ముద్రించామని, వాటికి నకిలీ నోట్లు తయారు చేయడం అసంభవం అని కేంద్ర ప్రభుత్వ పెద్దలు వాదించారు. కానీ ఆ తర్వాత కొన్ని నెలలకే ఆ రెంటికీ నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చేశాయి. 

ఇందుకు తాజా నిదర్శనంగా హైదరాబాద్‌, బాలాపూర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో మహేశ్వరం ఎస్‌ఓటి పోలీసులు గురువారం ఉదయం వాహనాలను తనికీలు చేస్తున్నప్పుడు ఓ వాహనంలో రూ.25 లక్షల విలువగల రూ.500 నకిలీ నోట్ల కట్టలు కనుగొన్నారు.

వాటిని మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసి, ఆ నోట్లను, వారి వాహనాన్ని మహేశ్వరం ఎస్‌ఓటి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

సాధారణంగా ఎన్నికల సమయంలోనే నల్లధనంతో పాటు ఇటువంటి నకిలీ నోట్లు బయటపడుతుంటాయి. ఈ సొమ్ముని ఎన్నికలలో ఖర్చు చేసేందుకే తెచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ఒకవేళ వారికి ఈ నోట్లు పట్టుబడక పోయి ఉంటే రాష్ట్రంలో రూ.25 లక్షల విలువగల నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చేసేవే కదా?

ప్రస్తుతం ఎన్నికలు జరుగబోతున్నాయి కనుక పోలీసులు వాహనాలు తనికీలు చేస్తున్నప్పుడు ఈవిదంగా నకిలీ నోట్లు పట్టుకోగలుగుతున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత చెక్ పోస్టుల వద్ద మొక్కుబడిగా తనికీలు తప్ప మరేమీ ఉండవు. కనుక మిగిలిన ఈ నాలుగున్నరేళ్ళలో ఇంకెన్ని లక్షలు, కోట్లు నకిలీ నోట్లు మార్కెట్లోకి వచ్చి చేరాయో? ఎవరికీ తెలీదు. 


Related Post