మల్లారెడ్డిని నమ్ముకోవడం మంచిదేనా సార్?

April 02, 2024


img

మంగళవారం తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మల్కాజ్‌గిరి పాలమెంట్ నియోజకవర్గం నేతలతో సమావేశమైనప్పుడు, మాజీ మంత్రి మల్లారెడ్డిని పొగడ్తలతో ముంచెత్తారు. మల్లారెడ్డి అంటే మాస్ మల్లన్న... మేడ్చల్ అంటే మాస్ మల్లన్న... ఆయన ఒక్క మేడ్చల్ నియోజకవర్గానికే పరిమితం కాకుండా తెలంగాణ అంతటా పర్యటించి లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారం చేసి గెలిపించాలని కోరారు. మాస్ మల్లన్న మల్లారెడ్డి మన పక్కన ఉన్నారు కనుక మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో బిఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి అవలీలగా భారీ మెజార్టీతో గెలుస్తారని కేటీఆర్‌ అన్నారు. మల్కాజ్‌గిరిలో మనకి బీజేపీతోనే పోటీ తప్ప కాంగ్రెస్ పార్టీతో కానే కాదని ఎందుకంటే, చేవెళ్ళలో రిజక్ట్ అయిన నేతను తీసుకువచ్చి ఇక్కడి నుంచి పోటీ చేయిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. ఈసారి కాంగ్రెస్‌ పార్టీ డమ్మీ అభ్యర్ధిని నిలబెట్టింది కనుక దీనిని మనం ఓ గొప్ప అవకాశంగా భావించి, శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రేటర్ పరిధిలో పదికి పది స్థానాలు గెలుచుకున్నట్లే, ఇప్పుడూ మల్కాజ్‌గిరి సీటుని గెలుచుకోవాలని కేటీఆర్‌ అన్నారు. 

ముందుగా మల్లారెడ్డి విషయానికి వస్తే ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయేందుకు ఎన్ని ప్రయత్నాలు చేశారో కేటీఆర్‌కి కూడా తెలుసు. కానీ ఏదో కారణం చేత ఆయన చేరలేక బిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారని కూడా తెలుసు. కనుక మల్లారెడ్డికి పార్టీలో పెద్దరికం అప్పగించి ఆయన చేజారిపోకుండా చూసుకోవాలని కేటీఆర్‌ ప్రయత్నిస్తున్నట్లున్నారు. కానీ కాంగ్రెస్‌ లేదా బీజేపీ చిటిక వేస్తే మల్లారెడ్డి తన కొడుకుతో సహా ఆ పార్టీలోకి జంప్ అయిపోవడం ఖాయమే. బహుశః లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారుతారేమో? కనుక అటువంటి మల్లారెడ్డిని నమ్ముకోవడం మంచిదో కాదో కేటీఆర్‌ ఆలోచించుకుంటే మంచిది.  

శాసనసభ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో ఒక్క సీటు గెలుచుకోలేక పోయినందునే కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో బిఆర్ఎస్ నాయకులను ఆకర్షించి పార్టీలో చేర్చుకుంటోంది. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలోకెల్లా మల్కాజ్‌గిరి అతి పెద్దది. అన్ని పార్టీలు అతి ముఖ్యమైనదిగా భావిస్తుంటాయి. కనుకనే రేవంత్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన ఆ నియోజకవర్గాన్ని మళ్ళీ కాంగ్రెస్‌ సొంతం చేసుకోవడానికే సునీతా మహేందర్ రెడ్డిని బరిలో దించుతోంది. కానీ ఆమెను కేటీఆర్‌ డమ్మీ క్యాండిడేట్ అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 


Related Post