ఆనాడు కేసీఆర్‌ చేసిన తప్పే రేవంత్‌ కూడా చేస్తున్నారా?

April 02, 2024


img



తెలంగాణలో చరిత్ర పునరావృతం అవుతున్నట్లు కనిపిస్తోంది. సాగునీరు తాగునీరు విషయంలో ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాలలో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రాజకీయంగా చూస్తే ఆనాడు కేసీఆర్‌ పాలనలో కాంగ్రెస్‌, టిడిపిలు ఎదుర్కొన్న కష్టాలనే ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కూడా ఎదుర్కొంటోంది. 

ఆనాడు కేసీఆర్‌ కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను, నేతలను బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకొని ఆ రెండింటినీ దాదాపు నిర్వీర్యం చేసేశారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు కలిసి బిఆర్ఎస్‌ పార్టీ నేతలను ఎత్తుకుపోతూ ఆ పార్టీని నిర్వీర్యం చేసేస్తున్నాయి. 

అయితే ఆనాడు కేసీఆర్‌ రాష్ట్రంలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్‌, టిడిపిలను నిర్వీర్యం చేయడం పెద్ద తప్పని తర్వాత తెలిసివచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలహీనపడగానే దాని స్థానంలోకి బీజేపీ ప్రవేశించింది. రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కేసీఆర్‌కు ఏవిదంగా ముచ్చెమటలు పట్టించారో అందరూ చూశారు. 

కానీ కేసీఆర్‌ అప్పుడూ అత్యాశకు పోయి పెద్ద తప్పిదం చేశారు. కేసీఆర్‌ తన పోరాటాలను రాష్ట్ర స్థాయి బీజేపీకి పరిమితం చేసుకొని ఉంటే శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ ఓడిపోయినా నేడు ఆయనకు ఇన్ని కష్టాలు ఉండేవే కావు. కానీ కేసీఆర్‌ తనను తాను జాతీయస్థాయికి పెంచుకోవాలనే దురాశతో చేజేతులా ప్రధాని నరేంద్రమోడీని శత్రువుగా మార్చుకున్నారు. దాని ఫలితం కూడా అనుభవిస్తున్నారు ఇప్పుడు. ఇది వేరే విషయం. 

అయితే ఆనాడు కేసీఆర్‌ చేసిన తప్పే ఇప్పుడు రేవంత్‌ రెడ్డి కూడా చేస్తున్నారని చెప్పక తప్పదు. రాష్ట్రంలో కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎంతైనా పోరాడవచ్చు. కానీ బిఆర్ఎస్‌ని నిర్వీర్యం చేస్తే మళ్ళీ దాని స్థానంలోకి బీజేపీ వస్తుంది. 

అప్పుడు ఆనాడు కేసీఆర్‌ ఎదుర్కొన్న పరిస్థితి, ఇబ్బందులే రేపు రేవంత్‌ రెడ్డి కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఈవిషయం సిఎం రేవంత్‌ రెడ్డికి తెలుసు కనుకనే కాంగ్రెస్‌ పరిధిని కాస్త దాటి తమ పార్టీకి, రాహుల్ గాంధీకి శత్రువైన ప్రధాని నరేంద్రమోడీని ‘పెద్దన్న’ అంటూ విధేయత చూపారని అనుకోవచ్చు. 

కానీ రాష్ట్రంలో బిఆర్ఎస్‌ని లేకుండా చేస్తే, అప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు మాత్రమే మిగిలుతాయి. అప్పుడు ‘తెలంగాణను మీరే పాలించుకోండని’ కాంగ్రెస్ పార్టీకి పెద్దన్న విడిచిపెడతారా? పెట్టరు కదా? కనుక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మనుగడకు మద్యలో బిఆర్ఎస్‌ మనుగడ కూడా అవసరమే అనుకోవచ్చు. ఎందుకంటే మూడు స్తంభాలట సాగుతున్నప్పుడే ముగ్గురికీ ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా?


Related Post