కల్వకుంట్ల కవిత బెయిల్‌ ఎప్పుడో?

April 02, 2024


img

లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఢిల్లీ తిహార్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టవలసి ఉండగా, ఏప్రిల్‌ 4వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు చేపడతామని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. దీంతో ఆమెతో పాటు కేసీఆర్‌, కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 

తన కుమారుడుకి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్‌ 16వరకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఆమె పిటిషన్‌ విచారణ చేపట్టలేదు కానీ ఈ కేసులో మధ్యంతర బెయిల్‌ మంజూరు కోసం వాదిస్తారా లేక పూర్తిస్థాయి బెయిల్‌ కోసం వాదిస్తారో మీరే నిర్ణయించుకోమని ఆమె తరపు న్యాయవాది అభిషేక్ సంఘ్వీకి కోర్టు సూచించింది. దాంతో రేపు (బుధవారం) సాయంత్రంలోగా రీజాయిండర్ పిటిషన్‌ వేస్తామని ఆయన తెలిపారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు మార్చి 15న కల్వకుంట్ల కవితని ఆమె ఇంటి వద్దే అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకువెళ్ళారు. 

మర్నాడు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా ఏప్రిల్‌ 9వరకు జ్యూడిషియల్ రిమాండ్‌ విధించింది. కోర్టు అనుమతితో ఈడీ అధికారులు ఆమెను వారం రోజులు కస్టడీలో తీసుకొని ప్రశ్నించారు. కస్టడీ ముగిసిన తర్వాత మార్చి 26న మళ్ళీ కోర్టులో ప్రవేశపెట్టి జ్యూడిషియల్ రిమాండ్‌పై తిహార్ జైలుకి తరలించారు. ఈ కేసు వెనుక రాజకీయాలు, పార్టీలు కూడా ఉన్నందున కల్వకుంట్ల కవితకు ఎప్పుడు విముక్తి కలుగుతుందో తెలీని పరిస్థితి కనిపిస్తోంది.


Related Post