ఎలక్షన్ కమీషన్, స్పీకర్‌ ఏం చేస్తున్నారు? బిఆర్ఎస్ ట్వీట్

April 02, 2024


img

బిఆర్ఎస్ పార్టీ ట్విట్టర్‌లో ఎన్నికల సంఘానికి, శాసనసభ స్పీకర్‌ని ఉద్దేశ్యించి “ఈ దేశంలో ఎన్నికల కమీషన్ ఉందా? బిఆర్ఎస్ పార్టీ టికెట్‌ మీద పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన కడియం శ్రీహరి, దానం నాగేందర్ గెలిచిన మూడు నెలలోపుగానే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. అయినా ఎన్నికల కమీషన్, శాసనసభ స్పీకర్‌ ఏం చేస్తున్నారు?రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ప్రేక్షకుల్లా చూస్తున్నారు. ఇది నిర్లక్ష్యం కాదా?

కాంగ్రెస్‌లో చేరిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల నిరోధింపు చట్టం కింద తక్షణం చర్యలు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము, ” అని ట్వీట్‌ చేస్తూ కడియం శ్రీహరి, దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సిఎం రేవంత్‌ రెడ్డితో దిగిన ఫోటోలను జోడించింది. 

తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఈ ఫిరాయింపుల సంస్కృతిని బిఆర్ఎస్ పార్టీయే ప్రవేశపెట్టి, రాజకీయాలలో కొత్త అధ్యాయం మొదలుపెట్టింది. లేకుంటే నేడు రాష్ట్రంలో రాజకీయాలు ప్రజాస్వామ్యబద్దంగానే సాగేవేమో?

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని లేదా కూలిపోతే మేమే అధికారంలోకి వస్తామని బిఆర్ఎస్ పార్టీ నేతలు చెపుతుండటం గమనిస్తే, నేటికీ ఆ పార్టీ వైఖరిలో మార్పు రాలేదని స్పష్టమవుతోంది. ఆనాడు తన ప్రభుత్వానికి ముప్పు ఉందనే వంకతోనే కేసీఆర్‌ కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలని బిఆర్ఎస్ పార్టీలోకి ఫిరాయింపజేసుకున్నట్లే, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ వలన తమ ప్రభుత్వానికి ముప్పు ఉందని కాంగ్రెస్‌ పార్టీ కూడా బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను తమ పార్టీలో ఫిరాయింపజేసుకుంటోంది. 

ఒకవేళ బిఆర్ఎస్‌ ఇలాంటి ఆలోచన చేయకుంటే, మేము కూడా ఆ పార్టీ జోలికి వెళ్ళమని సిఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు కూడా. కానీ వినలేదు కనుకనే కాంగ్రెస్ పార్టీ కూడా బిఆర్ఎస్‌ పద్దతినే అనుసరిస్తోంది. 

అయినా ఆనాడు తాము చేసింది, ఇక ముందు తాము చేయబోయేది తప్పు కాదనుకున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చేసింది తప్పెలా అవుతుంది? అనాడూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఇప్పుడు కాపాడమని అడిగి ఏం ప్రయోజనం? ధర్మాన్ని నువ్వు కాపాడితే అది నిన్ను కాపాడుతుందన్నట్లు, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి కట్టుబడి దానిని కాపాడి ఉంటే అది నేడు బిఆర్ఎస్ పార్టీని తప్పక కాపాడి ఉండేది. కానీ అప్పుడు అలా వ్యవహరించి, ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏమిటి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు! 

ఆనాడే బిఆర్ఎస్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రతిపక్షాలను గౌరవించి ఉంటే, తదనుగుణంగా పాలన సాగించి ఉండి ఉంటే నేడు ఈ దుస్థితి కలిగేదే కాదు కాదా? నేడు కాంగ్రెస్‌ని ఒక వేలుతో చూపితే మిగిలిన మూడు వేళ్ళు తమనే చూపిస్తున్నాయిగా? 



Related Post