అదృష్టం అంటే వైఎస్ షర్మిలదే

March 31, 2024


img

తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ తిరిగిన వైఎస్ షర్మిల, ఎన్నికల సమయానికి ఏమి చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నప్పుడు, తంతే బూరెల గంపలో పడిన్నట్లు వెళ్ళి ఏపీలో పడ్డారు. ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి చేపట్టారు.

ఏపీ సిఎంగా ఉన్న తన అన్న జగన్మోహన్‌ రెడ్డిని నోరారా విమర్శిస్తూ, ఏపీకి ప్రత్యేక హోదా అంటూ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఎవరూ ఆమె మాటలను నమ్మడం లేదు.

ఆమె ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టి అప్పుడే మూడు నెలలు అవుతున్నప్పటికీ ఇంతవరకు టిడిపి, వైసీపి, జనసేనల నుంచి ఒక్క నాయకుడు కూడా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఆమె సొంత అన్నను విమర్శిస్తుంటే మొదట్లో ఆసక్తి చూపిన ఆంధ్రా ప్రజలు ఇప్పుడు ఆమె మాటలను పట్టించుకోవడం మానేశారు. కనుక ఏపీ కాంగ్రెస్‌ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది.

ఈసారి అధికార వైసీపికి టిడిపి, జనసేన, బీజేపీల కూటమికి మద్య హోరాహోరీగా ఎన్నికలలో పోరు జరుగబోతోంది. ఒకవేళ ఆమె ఏపీ కాంగ్రెస్‌ పగ్గాలు చేపట్టకపోయి ఉంటే ఏపీ కాంగ్రెస్‌ ఎన్నికలలో పోటీ చేసి ఉండేదే కాదు. కానీ ఇప్పుడు సిద్దం అవుతుండటం విశేషం.

ఈరోజు సాయంత్రం వైఎస్ షర్మిల హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఈ సమావేషంలో ఏపీలోని 175/25 ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ఖరారు చేయబోతున్నారని తెలుస్తోంది.  ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్ధులుగా పోటీ చేసేందుకు మొత్తం 1500 మంది దరఖాస్తు చేసుకున్నారని వైఎస్ షర్మిల చెప్పారు.

అదే నిజమైతే నిజంగా చాలా ఆశ్చర్యకరమైన  విషయమే అవుతుంది. ఎందుకంటే ఏపీలో పోటీ పడుతున్న నాలుగు రాజకీయ పార్టీల మద్య కాంగ్రెస్‌ పోటీకి దిగితే ఆ పార్టీలో ఎవరికీ డిపాజిట్లు కూడా వెనక్కు తిరిగి వచ్చే అవకాశం ఉండదు కనుక!


Related Post