శాసనసభ ఎన్నికలలో స్టేషన్ ఘన్‌పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కేసీఆర్ టికెట్ నిరాకరించి కడియం శ్రీహరికి ఇచ్చారు. మొదట్లో రాజయ్య కన్నీళ్ళు పెట్టుకొని బాధపడినా కేసీఆర్ బుజ్జగింపుతో చల్లబడి కడియం శ్రీహరికి అన్ని విధాలా సహకరించారు. దాంతో కడియం శ్రీహరి ఎన్నికలలో విజయం సాధించారు.
అయితే ఆ తర్వాత రాజయ్య కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోగా, తాజాగా కడియం శ్రీహరి కూడా పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ ఇద్దరినీ పోగొట్టుకుంది.
అంతేకాదు... రాజయ్యని కాదని కడియం శ్రీహరికి టికెట్ ఇస్తే ఆయన ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఓ ఎమ్మెల్యే కూడా చేజారిపోయిన్నట్లయింది. అదే.. రాజయ్యకు మళ్ళీ టికెట్ ఇచ్చి ఉండి ఉంటే ఆయన బిఆర్ఎస్ పార్టీలోనే ఉండేవారేమో?
ఇటు బిఆర్ఎస్ పార్టీ నష్టపోగా అటు రాజయ్య కూడా నష్టపోతున్నారు. ఆయనకు, కడియం శ్రీహరికి మద్య ఉన్న శతృత్వం గురించి అందరికీ తెలిసిందే. బహుశః కడియం శ్రీహరిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ఆలోచన ఉంది కనుకనే రేవంత్ రెడ్డి రాజయ్యకు కాంగ్రెస్‌లో చేరేందుకు అనుమతించకపోయి ఉండవచ్చు.
ఇప్పుడు కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు కనుక రాజయ్యకు కాంగ్రెస్ తలుపులు మూసుకుపోయినట్లే.
ప్రస్తుతం బిఆర్ఎస్ పార్టీ వరంగల్ అభ్యర్ధి కోసం వెతుకుతోంది కనుక రాజయ్యని మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించి ఆ సీటు ఆయనకు ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే కనీసం కొంత నష్టం తగ్గించుకోగలుగుతుంది.