కేసీఆర్‌ బస్సు యాత్రతో ఏం సందేశం ఇస్తున్నారు?

March 31, 2024


img

తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌ నేడు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించి, సాగునీరు లేక పంటలు నష్టపోతున్న రైతులను పరామర్శించేందుకు బయలుదేరి వెళ్ళారు. కష్ట కాలంలో ప్రతిపక్ష రాజకీయ నాయకులు ప్రజల వద్దకు వెళ్ళి ధైర్యం చెప్పడం సర్వసాధారణమైన విషయమే. 

ఈ సందర్భంగా వారు ప్రభుత్వం మీద విమర్శలు చేసి ఒత్తిడి పెంచి సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. గతంలో కాంగ్రెస్‌, బీజేపీలు ఇదే చేశాయి కనుక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్‌ని తప్పు పట్టలేము. 

అయితే రైతుల ఓదార్చడానికి ‘ఓట్ ఫర్ బిఆర్ఎస్ పార్టీ’ అని వ్రాసున్న పెద్ద బస్సు వేసుకొని వెళ్ళడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లవుతోంది కదా?

ఈ వంకతో ఆయన రైతుల ఆగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీపైకి మళ్లించి త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో వారందరూ బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసేలా చేయాలనే ఆలోచన ఉందని అందరికీ తెలుసు. కేసీఆర్‌ ప్రయాణిస్తున్న పెద్ద బస్సే ఇందుకు నిదర్శనం కాదా? 

ఇది ఓట్ల కోసం రాజకీయం కాదనుకుంటే కేసీఆర్‌ కారులో వెళ్ళి రైతులను ఓదార్చి రావచ్చు. కానీ ‘ఓట్ ఫర్ బిఆర్ఎస్ పార్టీ’ అని వ్రాసున్న పెద్ద బస్సు వేసుకొని రైతుల వద్దకు వెళ్ళడం రాజకీయమే కదా?

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించకుండా అన్యాయం చేస్తోందని బిఆర్ఎస్ నేతలు వాదిస్తున్నప్పుడు, మరి కేసీఆర్‌ చేస్తున్నది ఏమిటి? ఆయన కూడా వారి ఆవేదనని, ఆగ్రహాన్ని బిఆర్ఎస్ పార్టీ కోసం వాడుకోవాలని అనుకుంటున్నారు కదా?


Related Post