రైతుల వద్దకు కేసీఆర్‌... పంపుతున్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే?

March 30, 2024


img

కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్నంత వరకు తెలంగాణలో రైతులకు నీటి కొరత ఉండేది కాదు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నీళ్ళ అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది సరిగ్గా వర్షాలు కురవకపోవడం వలన ప్రాజెక్టులలో నీళ్ళు నిలవలు తగ్గిపోయాయని, అందుకే పంటలకు నీళ్ళు అందించలేకపోతున్నామని కాంగ్రెస్‌ మంత్రులు చెపుతున్నారు. 

అది నిజమే కావచ్చు. నిజమే అయితే అది వారి దురదృష్టం కూడా. కేసీఆర్‌ నీళ్ళు అందించేవారని కానీ రేవంత్‌ రెడ్డి నీళ్ళు అందించలేకపోతున్నారనే భావన రైతులలో కలిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగడానికి ఎక్కువ సమయం పట్టదు. 

ఒకవేళ సమయం పడుతుందనుకున్నా బిఆర్ఎస్ పార్టీ అంత సమయం ఇవ్వడు. ఇప్పటికే ఇది కాంగ్రెస్‌ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కరువని, కేసీఆర్‌పై రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుని పాడుబెట్టేందుకు కుట్ర చేస్తోందని బిఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు. 

ఇప్పుడు కేసీఆర్‌ స్వయంగా సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్న రైతులను పలకరించి ధైర్యం చెప్పేందుకు సిద్దం అవుతున్నారు. ఆదివారం జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో పర్యటించి నీళ్ళు లేక ఎండిపోతున్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడబోతున్నారు.... అని అనే కంటే రైతుల సమస్యలతో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మీద బాణాలు వేయబోతున్నారని చెప్పవచ్చు. 

సాగునీటి సరఫరా విషయంలో కాంగ్రెస్‌ మంత్రులు జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కనుక కేసీఆర్‌ పర్యటన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చాలా ఇబ్బందికరంగా మారబోతోంది. నిజానికి ఆయనకు ఈ అవకాశాన్ని కల్పించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కదా?    



Related Post