కాసాని కాదు కేసీఆర్‌ అనుకుని పనిచేద్దాం: కేటీఆర్‌

March 30, 2024


img

బిఆర్ఎస్ పార్టీలో వలసలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రజలు, నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. 

శుక్రవారం తెలంగాణ భవన్‌లో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంలోని పార్టీ నేతలతో జరిగిన సన్నాహక సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ, “ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేదంటారు. అలాగే మనకు పట్నం మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కడియం, కెకె వంటివారు పార్టీకి వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారు. ఈవిదంగా సొంత ప్రయోజనాల కోసం పార్టీని మోసం చేసి కాంగ్రెస్‌లో చేరి మళ్ళీ ప్రజల మద్యకు వస్తున్నవారికి ప్రజలే గట్టిగా బుద్ధి చెప్పాలి. 

అధికారం శాశ్వితం కాదు. నిన్న మనం అధికారంలో ఉన్నాం. నేడు కాంగ్రెస్‌ ఉంది. రేపు మళ్ళీ మనమే అధికారంలో వస్తాము. అప్పుడు ఈ వెన్నుపోటు నేతలు తిరిగి వచ్చి కేసీఆర్‌ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడినా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదు. 

కాంగ్రెస్‌ పాలనపై అప్పుడే ప్రజలు తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారు. ముఖ్యంగా రైతులు సాగునీరు అందక చాలా నష్టపోతున్నారు. వారికి అండగా నిలబడి వారితోనే మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమిద్దాం. కాంగ్రెస్‌ సభలకు జనాలు రాకపోవడంతో తుక్కుగూడ సభకు పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి బస్సులలో జనాలను తెచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

చేవెళ్ళ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తున్నారు. కానీ కాసాని కాదు కేసీఆరే పోటీ చేస్తునట్లుగా భావించి మనందరం కష్టపడి పనిచేసి ఆయనను గెలిపించుకుందాము. ఆయనకు మద్దతుగా ఏప్రిల్‌ 13న చేవెళ్ళలో కేసీఆర్‌ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. కనుక ఈ సభను విజయవంతం చేసి మనమేమిటో నిరూపిద్దాం,” అని అన్నారు. 

ఇప్పుడు కేటీఆర్‌ ఆక్రోశిస్తున్నట్లే గతంలో కాంగ్రెస్‌, టిడిపిలు కూడా ఆక్రోశించాయి. కానీ అప్పుడు ఫిరాయింపులను కేసీఆర్‌, కేటీఆర్‌ గట్టిగా సమర్దించుకున్నారు. అప్పుడు పదవుల కోసం ఆ రెండు పార్టీలకు వెన్నుపోటు పొడిచినవారే ఇప్పుడు మళ్ళీ పదవుల కోసం బిఆర్ఎస్ పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోతున్నారు.

ఉద్యమకారులను, పార్టీ జెండాని మోసినవారిని కాదని అటువంటి అవకాశవాదులను తెచ్చుకున్నందుకు ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు. బహుశః రేపు కాంగ్రెస్, బీజేపీలకు వారు వెన్నుపోటు పొడిచినా ఆశ్చర్యం లేదు.

అవకాశవాదులను తెచ్చి పక్కన కూర్చొబెట్టుకొని కేసీఆర్‌ తప్పు చేశారు. కనుక కేటీఆర్‌ ఇప్పుడు వారిపై నిప్పులు చెరిగినా ప్రయోజనం ఉండదు. పైగా కేటీఆర్‌ ఈవిదంగా ఆక్రోశిస్తున్నకొద్దీ ఆనాడు కేసీఆర్‌ ఫిరాయింపుల పర్వం గురించి మళ్ళీ మళ్ళీ చర్చ జరుగుతుంటుందని మరిచిపోకూడదు.

అధికారంలో ఉన్నంత కాలం ఎప్పటికీ మేమే అధికారంలో ఉంటామనే భ్రమలో కేసీఆర్‌, కేటీఆర్‌ ఉండేవారు. కానీ అధికారం కోల్పోయాక శాశ్వితం కాదని చెపుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఉండే గొప్పదనమే ఇది.


Related Post