కాంగ్రెస్‌లో కేకేకి , బిఆర్ఎస్‌లో విప్లవ్ కుమార్‌కి గౌరవం లభిస్తుందా?

March 29, 2024


img

కె కేశవ రావు, ఆయన కుమార్తె మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన కుమారుడు. విప్లవ్ కుమారుడు స్పందిస్తూ, “నా తండ్రి, సోదరి విజయలక్ష్మి ఇద్దరూ పార్టీని వీడటం వారి సొంత నిర్ణయాలు. వాటితో నాకు సంబంధం లేదు. వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నప్పటికీ నేను బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. కేసీఆర్‌ నాయకత్వంపై నాకు పూర్తి నమ్మకం ఉంది,” అని అన్నారు. 

బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేశవరావుకి, ఆయన కొడుకు, కూతురు ముగ్గురికీ కేసీఆర్‌ సముచిత ప్రాధాన్యం, పదవులు ఇచ్చి గౌరవించారు. కానీ పార్టీకి కష్టకాలం వచ్చినప్పుడు తీర్ధయాత్రలకు వెళ్ళినవారు సొంత ఇంటికే తిరిగి వెళ్ళిన్నట్లు ఈ మలి వయసులో తాను కూడా కాంగ్రెస్ పార్టీ అనే సొంత ఇంటికి చేరుకొని దానిలో చనిపోతాను,” అని కేశవ రావు వివరణ ఇచ్చారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో పదవులు అనుభవించి, పదవుల కోసం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని విడిచిన్నట్లే, ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీని కష్టకాలంలో విడిచిపెట్టి ‘కాంగ్రెస్‌లోనే చచ్చిపోతాను’ అంటే కేశవరావు పోగొట్టుకొన్న గౌరవం లభిస్తుందా?

అయినా కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వి. హనుమంతరావు వంటి సీనియర్లనే అధిష్టానం పక్కన పెడుతున్నప్పుడు కష్టకాలంలో మొహం చాటేసి మళ్ళీ తిరిగి వస్తున్న కేశవరావుని నెత్తిన పెట్టుకుంటుందా?

ఇక తండ్రి, సోదరి కేసీఆర్‌కు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నపుడు, విప్లవ్ కుమార్‌ బిఆర్ఎస్ పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నా ఆయనను కేసీఆర్‌, పార్టీ నేతలు గౌరవిస్తారా? అసలు నమ్ముతారా లేదా? ఆలోచించుకుంటే మంచిదేమో? 



Related Post