మళ్ళీ పుంజుకొని కదం తొక్కుతాం: కేటీఆర్‌

March 29, 2024


img

ఒకే ఒక్క ఓటమితో బిఆర్ఎస్‌ పార్టీ కేవలం 3-4 నెలల్లో సగం ఖాళీ అయిపోయింది. ఇంకా ఖాళీ అయిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిన్న కెకె ఆయన కుమార్తె, హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించగా, కొన్ని గంటల వ్యవధిలోనే మాజీ మంత్రి, స్టేషన్‌ ఘన్‌పూర్‌ బిఆర్ఎస్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య తాను వరంగల్‌ ఎన్నికలలో నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు లేఖ వ్రాశారు. 

టికెట్‌ ఇచ్చిన తర్వాత ఆమె తప్పుకోవడం, పార్టీ అవినీతిలో కూరుకుపోయిందంటూ ఆ లేఖలో పేర్కొనడం రెండూ కేసీఆర్‌, బిఆర్ఎస్ పార్టీకి చాలా అవమానకరమే... చాలా ఇబ్బందికరమే అని అందరికీ తెలుసు. 

కడియం శ్రీహరికి తెలియకుండా కేసీఆర్‌ని, పార్టీని నిందిస్తూ కూతురు కావ్య లేఖ వ్రాసి ఉండదు. కనుక అది ఆయన అభిప్రాయం కూడా అని భావించవచ్చు. నేడు ఆయన తన కుమార్తెతో కలిసి ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరిపోబోతున్నట్లు సమాచారం. 

ఇదే సమయంలో మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి కేశవరావు నివాసానికి వెళ్ళి భేటీ అయ్యారు. వారిరువురూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టమవుతోంది. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో జరుగుతున్న ఈ పరిణామాలతో బిఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు చాలా ఆందోళన చెందడం సహజం. కనుక కేటీఆర్‌ వారిని ఉద్దేశ్యించి సోషల్ మీడియాలో ఓ పెద్ద లేఖ పోస్ట్ చేశారు.  

కేసీఆర్‌ ఒంటరిగా ప్రయాణం ప్రారంభించి తెలంగాణ సాధించి లక్షల మందితో బిఆర్ఎస్‌ సైన్యాన్ని తయారు చేశారని, ఈ క్రమంలో ఆయన అనేక అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కొని అన్నిటినీ ఛేదించిన ధీరుడని కేటీఆర్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 

ఈ వలసలతో బిఆర్ఎస్‌ పార్టీని దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెపుతారు. మళ్ళీ నిఖార్సైన కొత్త తరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పన్ధాలో కదం తొక్కుదాం,” అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.


Related Post