మేము కాంగ్రెస్‌లో చేరుతున్నాము: మేయర్ విజయలక్ష్మి

March 29, 2024


img

హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె తండ్రి బిఆర్ఎస్ పార్టీ ఎంపీ కే.కేశవరావు ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయం ఆమె స్వయంగా ప్రకటిస్తూ, “అధికార పార్టీలో ఉంటేనే ప్రజా సమస్యలు పరిష్కరించగలుగుతాము.

అందువల్లే కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు నేను, మా తండ్రి గారు కే.కేశవరావు ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాము. ఒకటి రెండు రోజులలో ఇద్దరం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాము,” అని చెప్పారు. 

కే.కేశవరావు మీడియాతో మాట్లాడుతూ, “నేను చాలా ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను. కానీ తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని కేసీఆర్‌ పిలుపు మేరకు నేను బిఆర్ఎస్ పార్టీలో చేరాను. ఆయన నాకు పార్టీలో సముచిత స్థానం కల్పించి చాలా గౌరవించారు. 

కానీ ప్రస్తుత పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీలో ఉండటం కంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే ప్రజలకు ఎక్కువ సేవ చేయగలుగుతామని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నిన్న కేసీఆర్‌ని కలిసి ఈ విషయం చెప్పి పార్టీ వీడుతున్నాను.

ఈ సందర్భంగా ఆయనతో కల్వకుంట్ల కవిత అరెస్ట్ గురించి కూడా చర్చించాను. ఆమెను అన్యాయంగా ఈ కేసులో ఇరికించి అరెస్ట్ చేశారని నేను భావిస్తున్నాను,” అని అన్నారు. 

నాలుగు రోజుల క్రితం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవాహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ మేయర్ విజయలక్ష్మి ఇంటికి వచ్చి కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ అప్పుడు తాను పార్టీ మారడం లేదని చెప్పిన విజయలక్ష్మి ఇప్పుడు స్వయంగా పార్టీ మారుతున్నాని ముహూర్తం కూడా ప్రకటించారు.

 కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్ష పదవితో సహ అనేక పదవులు అనుభవించి కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పుడు విడిచిపెట్టి బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయి రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దానిని విడిచిపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. ఏమంటే ప్రజల కోసమే అంటున్నారు!


Related Post