కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సానియా... కాంగ్రెస్‌కే నష్టం!

March 28, 2024


img

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు ఎంపీ టికెట్‌ ఇవ్వబోతున్నట్లు గత రెండు మూడు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సానియా మీర్జాకు ఈ ఊహాగానాల గురించి తెలియదని అనుకోలేము. కానీ ఆమె ఇంతవరకు వీటిపై స్పందించలేదు. నిప్పు లేనిదే పొగరాదు కనుక వీటిలో ఎంతో కొంత నిజం ఉండవచ్చు.

నిజానికి హైదరాబాద్‌ నుంచి అజహారుద్దీన్ పోటీ చేయాలనుకున్నారు. కానీ మజ్లీస్ అభ్యర్ధి అసదుద్దీన్‌ ఓవైసీని ఓడించడం చాలా కష్టం. ఇప్పటికే శాసనసభ ఎన్నికలలో అజహారుద్దీన్ ఓసారి ఓడిపోయారు.

ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓడిపోతే పరువు పోతుంది. కనుక ఈసారి తన కోడలు ఆనం మీర్జా అక్క సానియా మీర్జాకి టికెట్‌ ఇవ్వాలని ఆయనే స్వయంగా కాంగ్రెస్‌ అధిష్టానానికి ప్రతిపాదించిన్నట్లు తెలుస్తోంది. 

టెన్నిస్ క్రీడాకారిణిగా సానియా మీర్జాకు ముస్లిం యువతలో ఉన్న పాపులారిటీ గురించి వేరే చెప్పక్కరలేదు. పైగా మాజీ క్రికెటర్ అజరుద్దీన్ కూడా ఆమెకు తోడుగా నిలిస్తే అసదుద్దీన్‌ ఓవైసీని ఓడించే అవకాశం కూడా ఉంది. 

కానీ మజ్లీస్ పార్టీ ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ పార్టీవైపు మొగ్గుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అదనంగా కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఓ వైపు బిఆర్ఎస్‌, మరోవైపు బీజేపీ నేతలు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొడతామని బెదిరిస్తున్నారు. 

అటువంటి పరిస్థితే వస్తే రేవంత్‌ రెడ్డికి అండగా నిలబడతామని అసదుద్దీన్‌  ఓవైసీ హామీ ఇచ్చారు. కనుక అందుకోసమైనా హైదరాబాద్‌ సీటు విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనక్కు తగ్గి అసదుద్దీన్‌ ఓవైసీ గెలుపుకి సహకరించక తప్పదు. 

కాదని సానియా మీర్జాని బరిలో దించితే కాంగ్రెస్‌, బీజేపీ,మజ్లీస్‌ పార్టీల మద్య ముక్కోణపు పోటీ జరిగి ఓట్లు చీలి ఓవైసీ నష్టపోతారు. అప్పుడు ఆయన వెంటనే కేసీఆర్‌తో చేతులు కలుపవచ్చు.

ఈ ఆలోచనతోనే కేసీఆర్‌ హైదరాబాద్‌ సీటుకి బలహీనమైన గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ని అభ్యర్ధిగా ప్రకటించి పరోక్షంగా ఇటు మజ్లీస్‌, అటు బీజేపీకి అడ్డుగా ఉండబోమని సంకేతం ఇచ్చారనుకోవచ్చు. 

కనుక కాంగ్రెస్ పార్టీ సానియాని అభ్యర్ధిగా ప్రకటిస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ. సానియా లేదా మరొకరిని హైదరాబాద్‌ నుంచి గెలిపించుకోవడం కంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ ముఖ్యం. కనుక కాంగ్రెస్ పార్టీ కూడా సానియాను కాక బలహీనమైన అభ్యర్ధినే నిలబెట్టవచ్చు.


Related Post