ఫిరాయింపులపై కేటీఆర్‌ మాట్లాడితే ఏం బాగుంటుంది?

March 26, 2024


img

ఈరోజు తెలంగాణ భవన్‌లో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నేతలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “దానం నాగేందర్ పార్టీకి, తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఆయన పదవులు, అధికారం కోసం ఆశపడి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 

గతంలో కూడా ఆయన టిడిపి టికెట్‌ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ పోటీ చేస్తే ఉప ఎన్నికలలో ఓడిపోయారు. ఇప్పుడూ అలాగే జరుగుతుంది. ఆయనపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయాలని కోరుదాము. ఒకవేళ స్పీకర్‌ స్పందించకుంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి న్యాయపోరాటానికి చేయడానికి వెనకాడము. 

ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తే ఎలాగూ మన పార్టీ చేతిలో ఓడిపోతారు. ఆ తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరుగుతుంది. ఆ స్థానాన్ని మనం కైవశం చేసుకోవాలి,” అని అన్నారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు, ప్రధాని నరేంద్రమోడీ, ఆదానీ విషయంలో రాహుల్ గాంధీ తదితర కాంగ్రెస్‌ నాయకులు ఒకలా మాట్లాడుతుంటే, సిఎం రేవంత్‌ రెడ్డి మరోలా మాట్లాడుతున్నారని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి కూడా బీజేపీలో చేరిపోతారని, అందుకే తెలంగాణలో వసూలైన రూ.2,500 కోట్లు సూట్ కేసులలో ఢిల్లీకి పంపించారు. రేవంత్‌ రెడ్డి జీవితమంతా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పగలరా?” అని ప్రశ్నించారు.

కేసీఆర్‌ కూడా ఇదివరకు కాంగ్రెస్‌, టిడిపి ఎమ్మెల్యేలను నయాన్నో భయాన్నో పార్టీలోకి రప్పించుకున్నారు. అదే సమయంలో దానం నాగేందర్‌ కూడా బిఆర్ఎస్ పార్టీలో చేరారు. బంగారి తెలంగాణ కోసం అంటూ ఫిరాయింపులు ప్రోత్సహించి ఇతర పార్టీలను నిర్వీర్యం చేసినప్పుడు, కేటీఆర్‌కు తప్పుగా అనిపించలేదు. ఆనాడు కాంగ్రెస్‌, టిడిపిలు స్పీకర్‌కు ఎన్ని పిర్యాదులు చేసినా చర్యలు తీసుకోకపోతే కేటీఆర్‌ తప్పనుకోలేదు. 

ఆనాడు ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర టిడిపి ఎమ్మెల్యేలు టిడిపి శాసనసభాపక్షాన్ని బిఆర్ఎస్ పార్టీలో విలీనం చేస్తే అది చాలా గొప్ప విషయమన్నట్లు మాట్లాడారు. కానీ దానం నాగేందర్ మళ్ళీ కాంగ్రెస్‌ గూటికి వెళ్ళిపోతే కేటీఆర్‌ నమ్మకద్రోహం అంటున్నారు. 

తెలంగాణలో పదవులు, అధికారం, కాంట్రాక్టులు ఆశ చూపించి ఫిరాయింపుల సంస్కృతిని పెంచి పోషించింది కేసీఆరే కదా? ఇప్పుడు కాంగ్రెస్‌, బీజేపీలు అదే ఫాలో అయితే సంతోషించాలి కానీ బాధపడటం దేనికి? పడినా షుగర్, బీపీ లెవెల్స్ పెరగడం తప్ప ప్రయోజనం ఉంటుందా?

ఆరూరి రమేష్ పార్టీని వీడబోతుంటే వారించారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజేపీలో చేరిపోతారని చెప్పడాన్ని కేటీఆర్ తప్పుగా భావించలేదు! శాసన సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కేసీఆర్, కేటీఆర్, మరికొందరు నేతల ఈ అహంభావం కూడా ఓ కారణమని ఇంకా గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 


Related Post