నేను... చేరలేని దూరం కాదు: రేవంత్‌ రెడ్డి ట్వీట్‌

March 24, 2024


img

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా సామాన్య ప్రజలకు సైతం ముఖ్యమంత్రి నివాసం గేట్లు తెరుచుకున్నాయి. 

శనివారం జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన సామాన్య ప్రజలను కలుసుకొని వారి సమస్యలను ఓపికగా విని వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

వాటన్నిటిపై తక్షణం చర్యలు చేపట్టాలని సిఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. వాటిలో కొన్ని ఎన్నికల కోడ్ కారణంగా తక్షణం అమలు చేయలేమని, ఎన్నికల ప్రక్రియ ముగియగానే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్‌ చేశారు. “నేను... చేరలేని దూరం కాదు... దొరకనంత దుర్గం కాదు... సామాన్యుల మనిషి నేను. సకల జనహితుడను నేను...” అనే చిన్న మెసేజ్ పెట్టి దానితో పాటు తనను కలిసేందుకు వచ్చిన ఓ వ్యక్తితో దిగిన వీడియోని కూడా పోస్ట్ చేసి ప్రజలతో షేర్ చేసుకున్నారు. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రజాధనంతో నిర్మించుకున్న ప్రగతి భవన్‌ కంచుకోటలోకి సొంత పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా అనుమతించేవారు కారు. అలాగే ప్రజాధనంతో నిర్మించిన సచివాలయంలోకి కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, సామాన్య ప్రజలను అనుమతించేవారు కారు. 

కానీ రేవంత్‌ రెడ్డి ఈ పద్దతికి స్వస్తి పలికి ప్రగతి భవన్‌ చుట్టూ ఏర్పాటు చేసిన బ్యారీకేడ్లు తొలగించి సామాన్య ప్రజలను లోనికి అనుమతించడం మొదలుపెట్టారు. అలాగే సచివాలయంలోకి అందరినీ అనుమతిస్తున్నారు. తన నివాసంలో కూడా సామాన్య ప్రజలను కలుస్తూనే ఉన్నారు. దీనిని సామాన్య ప్రజలు సైతం హర్షిస్తున్నారు. అందుకే తాను ప్రజల మనిషనని సిఎం రేవంత్‌ రెడ్డి సగర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. 


Related Post