కేసీఆర్‌ మౌనం, బీజేపీ ప్రశ్నించడం రెండూ విచిత్రమే

March 23, 2024


img

బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు వ్యవహారంపై కేసీఆర్‌ వెంటనే స్పందించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. సిఎం రేవంత్‌ రెడ్డి కూడా కూతురు అరెస్ట్ అయితే కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌ని ప్రశ్నించడం సహజంగానే ఉంది. కానీ బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి కూడా కేసీఆర్‌ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించడమే విచిత్రంగా ఉంది.

కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసిందే కేంద్ర ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే ఈడీ. కనుక బిఆర్ఎస్‌ నేతలే బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతూ, లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీని ఒత్తిడికి గురిచేయడానికే ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేశారని విమర్శిస్తున్నారు.

కనుక వారి విమర్శలకు కిషన్ రెడ్డే సమాధానం చెప్పుకోవలసి ఉంది. చెప్పుకున్నారు కూడా. కల్వకుంట్ల కవిత అరెస్టుతో బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదన్నారు.

అదేవిదంగా కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, ఆ కేసులో ఆమె అరెస్టుతో తెలంగాణకు కూడా ఎటువంటి సంబందమూ లేదన్నారు. కనుక కల్వకుంట్ల కవిత అరెస్టుని చూపి సానుభూతి ఓట్లు సంపాదించుకోవాలనే బిఆర్ఎస్‌ ఆశలు ఫలించవని కిషన్ రెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ఆయన కూతురు కవిత అరెస్ట్ అయితే కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


Related Post