అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్టుని ఖండిస్తున్నా: కేసీఆర్‌

March 23, 2024


img

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూతురు కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు స్పందించని బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌, ఇదే కేసులో ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అధికారులు అరెస్ట్ చేసినప్పుడు స్పందించడం విశేషం.

ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. దేశంలో ప్రతిపక్షాలను తుడిచిపెట్టేసి బీజేపీకి మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తోంది. 

ఇదివరకు ఢిల్లీ డిప్యూటీ సిఎం మనీష్ సిసోడియా, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇప్పుడు ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్టులు రాజకీయ దురుదేశ్యంతో చేసినవిగానే భావిస్తున్నాము. 

అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనను తక్షణమే బేషరతుగా విడుదల చేసి ఈ కేసు ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను,” అని కేసీఆర్‌ అన్నారు.        

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు ఏదో రోజు తమ పీకకు చుట్టుకొంటుందని బహుశః అర్వింద్ కేజ్రీవాల్‌, కేసీఆర్‌, కల్వకుంట్ల కవిత ముగ్గురికీ తెలిసే ఉంటుంది. కానీ జాతీయ స్థాయి రాజకీయాలలో మార్పులు, చేర్పులు జరిగి బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాలేని పరిస్థితి వస్తుందని, అప్పుడు ఈ కేసు తమని ఏమీ చేయలేదని వారు భావించి ఉండవచ్చు. 

కానీ జాతీయ రాజకీయాలలో అటువంటి మార్పు రానీయకుండా కేంద్ర ప్రభుత్వం ఈ కేసులతోనే చక్రం తిప్పుతూ ప్రతిపక్షాలను కట్టడి చేస్తోంది. కనుక ఈ కేసుల నుంచి విముక్తి పొందాలంటే బీజేపీతో రాజీ పడక తప్పకపోవచ్చు. ఈ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. కనుకనే ఆయన కూతురు అరెస్ట్ అయినప్పుడు మౌనంగా ఉండిపోయారని భావించవచ్చు. 

ఇప్పుడు అర్వింద్ కేజ్రీవాల్‌ని కూడా అరెస్ట్ చేయడంతో, దేశంలో ప్రతిపక్షాలన్నీ మళ్ళీ ఏకం అవుతున్నందున కేసీఆర్‌ కూడా మౌనం వీడి అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ ఖండించిన్నట్లు భావించవచ్చు.


Related Post