ఈడీ, సీబీఐ, ఐ‌టిలు రాజకీయ కక్ష సాధింపులకేనా?

March 22, 2024


img

లిక్కర్ స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు గురువారం రాత్రి ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టుని దేశం అని విపక్ష పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.

బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందిస్తూ, “ఈడీ, సీబీఐ, ఐ‌టిలు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాజకీయ సాధనాలుగా మారిపోయాయి. బీజేపీ ప్రత్యర్ధులపై కక్ష సాధింపులకు వాటిని దుర్వినియోగం చేస్తోంది. ఎటువంటి తప్పు చేయకపోయినా వాటితో చేత అక్రమ కేసులు నమోదు చేయించి బీజేపీ ప్రత్యర్ధులను వేదిస్తోంది. ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని అరెస్టుని బిఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది,” అని అన్నారు. 

ఇదే కేసులో మార్చి 15వ తేదీన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయి ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీపై ఒత్తిడికి గురిచేసి బీజేపీకి లబ్ధి కలిగించేందుకే కేంద్ర ప్రభుత్వం ఆమెను ఈడీ చేత అరెస్ట్ చేయించిందని బిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ని కూడా అరెస్ట్ చేయడంతో ఈ కేసు ఉచ్చు కల్వకుంట్ల కవిత మెడకు ఇంకా బిగుసుకుపోయే అవకాశం కనిపిస్తోంది. 

ఈ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌, కల్వకుంట్ల కవిత తదితరులు సూత్రధారులని వాదిస్తున్న ఈడీ, సౌత్ లాబీలో మరో ప్రధాన సూత్రధారిగా  ఏపీలోని వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి జోలికి మాత్రం వెళ్ళలేదు.

ఇదే కేసులో ఆయన కొడుకు రాఘవ్ రెడ్డిని అరెస్ట్ చేసి అప్రూవరుగా మారిన తర్వాత విడుదల చేసింది. కానీ శ్రీనివాసులు రెడ్డి టిడిపి, జనసేన, బీజేపీ కూటమిలో చేరడంతో ఆయన జోలికి వెళ్ళడం లేదు. ఈ కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన రాఘవరెడ్డి ఈసారి టిడిపి అభ్యర్ధిగా ఒంగోలు నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు కూడా. 

అంటే మన పార్టీ, మన కూటమిలో ఉంటే కేసులు ఉండవు. ప్రత్యర్ధిగా ఉంటే కేసులు ఉంటాయని అనుకోవాలేమో?


Related Post