26 మంది బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారట... నిజమా?

March 21, 2024


img

పదేళ్ళపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాశించిన బిఆర్ఎస్ పార్టీకి శాసనసభ ఎన్నికలలో ఓటమి శాపంగా మారింది. అప్పటి నుంచి పలువురు నేతలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరిపోతూనే ఉన్నారు. మరోపక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో కల్వకుంట్ల కవితని ఈడీ అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోవడంతో కేసీఆర్‌ కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. 

ఆమె అరెస్టుతో బిఆర్ఎస్ నేతలకు కేంద్ర ప్రభుత్వం బలమైన సందేశమే ఇచ్చిన్నట్లయింది. కేసీఆర్‌ కూతురినే అరెస్ట్ చేయగలిగినప్పుడు తమ పరిస్థితి ఏమిటని వారిలో భయాందోళనలు పెరిగి బీజేపీలో చేరిపోయేందుకు సిద్దం అవడం ఖాయమే. 

ఇటువంటి విపత్కర పరిస్థితులలో బిఆర్ఎస్ పార్టీ తలరాతను మార్చే కీలకమైన లోక్‌సభ ఎన్నికలు ఎదుర్కోవలసి వస్తుండటం మరో అగ్నిపరీక్షగా మారింది. ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ నుంచి వచ్చిన నేతలనే కాంగ్రెస్‌, బీజేపీలు అభ్యర్ధులుగా బరిలో దించుతుండటంతో బిఆర్ఎస్ పార్టీకి ఇంకా తలనొప్పిగా మారింది. 

బిఆర్ఎస్ పార్టీ ఇంత క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడే ప్రభుత్వ విప్, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 26 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారంటూ బాంబు పేల్చారు. ఇదివరకు ఇలా చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదు. కానీ కాంగ్రెస్‌ గేట్లు ఎత్తేశాక ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో బీర్ల ఐలయ్య చెప్పిన మాటలను తేలికగా కొట్టేయలేము. 

మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దపడగా, ఆయన కాలేజీలలో మళ్ళీ ఐ‌టి సోదాలు మొదలయ్యాయి. కనుక వారిరువురూ వీటి నుంచి ఉపశమనం, రక్షణ పొందేందుకు బీజేపీలో చేరిపోయే అవకాశం కనిపిస్తోంది. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ వీడేందుకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.

కనుక బీర్ల ఐలయ్య చెప్పిన్నట్లు లోక్‌సభ ఎన్నికలకు ముందు లేదా తర్వాత బిఆర్ఎస్ పార్టీ చాలా వరకు ఖాళీ అయిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది.


Related Post