కాంగ్రెస్‌ గొర్రెల మందలో ఉండలేక బిఆర్ఎస్ మందలో....

March 19, 2024


img

తెలంగాణలో నిరంకుశ, కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్‌ దొరతో పోరాడి, ఆయన కట్టుకున్న గడీని బద్దలు కొట్టి దళితులకు రాజ్యాధికారం కల్పిస్తానని నమ్మబలికిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ సోమవారం తన 80 మంది అనుచరులతో కలిసి తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “బిఆర్ఎస్ పార్టీతో పొత్తు ప్రతిపాదనను మాయావతి వ్యతిరేకించారు. కానీ కేసీఆర్‌లాగ ఆడిన మాట తప్పేవాడిని కాదు కనుక నా నిర్ణయానికే కట్టుబడి బీఎస్పీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరాను. తెలంగాణవాదానికి, బహుజనవాదం కూడా తోడైతే మంచిదనే ఉద్దేశ్యంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను,” అని చెప్పారు. 

తన ఈ నిర్ణయంపై సిఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, “అవును. రేవంత్‌ రెడ్డి నన్ను టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ పదవి చేపట్టాలని కోరారు. కానీ కాంగ్రెస్‌లో చేరుతున్న గొర్రెల మందలో నేను ఒకడిగా ఉండదలచుకోలేదు. అందుకే బిఆర్ఎస్ పార్టీలో చేరాను. 

రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రే కావచ్చు కానీ నా ఈ నిర్ణయాన్ని తప్పు పట్టే, ప్రశ్నించే హక్కు ఆయనకు లేదు. ఎవరి నచ్చిన పని వారు చేసుకునే హక్కు అందరికీ ఉంది. కనుక ఆయన నన్ను బెదిరించడం మానుకుంటే మంచిది,” అని ప్రవీణ్ కుమార్‌ హెచ్చరించారు.  

దళితులకు రాజ్యాధికారం సాధిస్తానంటూ ప్రవీణ్ కుమార్‌ గత మూడేళ్ళుగా తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటిస్తూ, రాష్ట్రంలో పాపులారిటీ, దాంతో పాటు తనకంటూ ఓ బలమైన అనుచర వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

ఆ గుర్తింపు, పరపతిని, బలాన్ని తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నంలో కేసీఆర్‌ పంచన చేరి దళితుల నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక ఎంపీ టికెట్‌ కోసం ఇంత గుర్తింపు, గౌరవం ఇచ్చిన బీఎస్పీకి, రాష్ట్రంలో దళితులకు ప్రవీణ్ కుమార్‌ ద్రోహం చేయడం చాలా శోచనీయం. 

పైగా నేను కాంగ్రెస్‌ గొర్రెలలో ఒకడిగా ఉండదలచుకోలేదు అంటూ బిఆర్ఎస్ గొర్రెగా మారిపోయారు. ఎన్నికలలో ఓటమి తర్వాత బీఎస్పీని వదిలేసి తన దారి తాను చూసుకున్నారు. అయినా తాను ఎవరికీ ద్రోహం చేయలేదని వాదిస్తుండటం సిగ్గుచేటే కదా?


Related Post