దొర సేవలో తరిస్తారట!

March 16, 2024


img

తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కొద్ది సేపటి క్రితమే ట్విట్టర్‌లో ప్రకటించారు. 

నేను పార్టీని వీడుతున్నానని మీ అందరికీ తెలియజేయడం నాకు చాలా కష్టంగానే ఉంది. కానీ ఇప్పుడు మరో సరికొత్త మార్గంలో ప్రయాణించవలసిన సమయం ఆసన్నమైంది కనుక తప్పని పరిస్థితులలో నేను పార్టీని వీడుతున్నాను. 

బీఎస్పీ అధ్యక్షుడుగా లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలనే నా నిర్ణయం వలన మా పార్టీకి చెడ్డపేరు రావడం నాకు ఇష్టం లేదు. నేను ఎవరినీ తప్పు పట్టడం లేదు. నేను నా పార్టీని, నన్ను నమ్ముకున్నవారిని కూడా మోసం చేయాలనుకోవడం లేదు. 

పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. 

బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. కనుక ఇప్పుడు తెలంగాణలో ఏవిదంగా ముందుకు సాగాలో బీఎస్పీ నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చి ఇంతకాలం నాకు మార్గదర్శనం చేసిన బీఎస్పీ అధినేత్రి మాయావతి దీదీకి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 

బీఎస్పీ సిద్దాంతకర్తలు చెప్పిన సామాజిక న్యాయానికి నేను ఎల్లప్పుడూ కట్టుబడే ఉంటాను. దాని కోసం నేను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాను. దేశవ్యాప్తంగా బహుజనులు నాపై ఉంచిన నమ్మకానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నాపై ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ నేను బీఎస్పీ సిద్దాంతాలను విడిచిపెట్టనని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను,” అని ప్రవీణ్ కుమార్‌ ట్వీట్‌ సారాంశం.    

బిఆర్ఎస్ పార్టీతో పొత్తుకి సిద్దపడినందుకు కేసీఆర్‌ ప్రవీణ్ కుమార్‌కు నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. బీఎస్పీకి అసదుద్దీన్‌  ఓవైసీ చేతిలో ఓడిపోబోయే హైదరాబాద్‌ సీటుని కూడా ఇచ్చారు.

కనుక బీఎస్పీని నమ్ముకొని నష్టపోవడం కంటే బిఆర్ఎస్ పార్టీలో చేరిపోయి కేసీఆర్‌ ఇచ్చిన ఆఫర్ స్వీకరించి నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిస్తే మంచిదని ప్రవీణ్ కుమార్‌ భావించిన్నట్లు అర్దమవుతూనే ఉంది. అంటే ఆయన తన దారి తాను చూసుకున్నారన్న మాట!

ఇంతకాలం దళితులకు రాజ్యాధికారం సాధిస్తా...  కేసీఆర్‌ ఓ దొర… నిరంకుశ పాలన చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేసిన ప్రవీణ్ కుమార్‌ ఇప్పుడు దళితుల రాజ్యాధికారం సంగతి మరిచిపోయి, ఆ దొర ఇచ్చిన ఎంపీ సీటు తీసుకొని దొర సేవలో తరించబోతున్నారు.

అయినా తాను ఎవరినీ మోసం చేయలేదని, నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడే ఉన్నానని చెప్పడం చూస్తే అప్పుడే ప్రవీణ్ కుమార్‌ పక్కా రాజకీయ నాయకుడుగా పరివర్తన చెందిన్నట్లే ఉన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలు మరే నాయకుడిని నమ్మలేని పరిస్థితి కల్పించారు ప్రవీణ్ కుమార్‌ అంటే అతిశయోక్తి కాదు.


Related Post