నేడు ఏపీ పర్యటనకు తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి!

March 16, 2024


img

రేవంత్‌ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నేడు (శనివారం) ఆంధ్రప్రదేశ్‌ పర్యటనకు వెళ్ళబోతున్నారు.

ఈరోజు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో  కూర్మన్నపాలెం సమీపంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకుంటారు.      

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులు, వారికి సంఘీభావం తెలుపుతూ ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నేతలు కలిసి ఈ సభ నిర్వహించబోతున్నారు. వారికి సంఘీభావం తెలిపేందుకే సిఎం రేవంత్‌ రెడ్డి ఈ సభలో పాల్గొనేందుకు నేడు విశాఖ వెళ్ళబోతున్నారు.

అయితే నేడు ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీ కాంగ్రెస్‌ నిర్వహిస్తున్న ఈ సభకు హాజరు కాబోతుండటం రాజకీయ కారణంతోనే అని అర్దమవుతోంది.

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇప్పటికే తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కనుక సిఎం రేవంత్‌ రెడ్డి కూడా జగన్‌ ప్రభుత్వం, పాలన గురించి మాట్లాడటం ఖాయమే అని భావించవచ్చు. అప్పుడు ఏపీ మంత్రులు, వైసీపి నేతలు రేవంత్‌ రెడ్డిపై ఎదురుదాడి చేయకుండా ఉండరు. 

ఏపీలో టిడిపి, జనసేనలతో బీజేపీ కూడా పొత్తు పెట్టుకొని కలిసి పోటీ చేయబోతోంది. ఆ మూడు పార్టీలు కలిసి రేపు చిలకలూరిపేటలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ కూడా పాల్గొనబోతున్నారు.  కనుక ఏపీలో శాసనసభ ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణం వేడెక్కడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయిన్నట్లే భావించవచ్చు.


Related Post